Chirayu Amin: పనామా ఎఫెక్ట్: ఐపీఎల్ మాజీ బాస్‌కు ఈడీ షాక్.. రూ.10.35 కోట్ల ఆస్తులు సీజ్!
- పనామా పేపర్స్ కుంభకోణంలో చిరాయు అమిన్‌పై అభియోగాలు
- ఫెమా చట్టం కింద మ్యూచువల్ ఫండ్స్ సీజ్
- ఇదే కుంభకోణంలో చిక్కుకుని ప్రధాని పదవిని కోల్పోయిన నవాజ్ షరీఫ్
ఐపీఎల్ మాజీ చైర్మన్ చిరాయు అమిన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. ‘పనామా పేపర్ల’ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిరాయుకు చెందిన రూ.10.35 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్లను సీజ్ చేసినట్టు ఈడీ పేర్కొంది. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) కింద చిరాయు ఆస్తులను సీజ్ చేసినట్టు తెలిపింది. సీజ్ చేసిన ఫండ్స్ వైట్‌ఫీల్డ్ కెమ్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినవిగా పేర్కొంది. ఈ కంపెనీని అమిన్ కుటుంబ సభ్యులే నిర్వహిస్తున్నట్టు తెలిపింది.
పనామా పేపర్స్ ప్రకారం.. బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్‌లో అమిన్, ఆయన కుటుంబ సభ్యులకు పెట్టుబడులు ఉన్నాయి. విచారణ సమయంలో అమిన్, ఆయన కుటుంబ సభ్యులతోపాటు వైట్‌ఫీల్డ్ కెమ్‌టెక్ కంపెనీకి కూడా నోటీసులు ఇచ్చినట్టు ఈడీ పేర్కొంది. బ్రిటన్‌లోని కంపాడెన్ హిల్‌లో వీరు ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌ను 1.6 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్టు తెలిపింది.
అపార్ట్‌మెంట్ కొనుగోలు కోసం 2.4 మిలియన్ డాలర్లను సింగపూర్‌లో ఉన్న తన అనుబంధ సంస్థకు వైట్‌ఫీల్డ్ కంపెనీ ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ కింద ట్రాన్స్‌ఫర్ చేసినట్టు ఈడీ వివరించింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ సొమ్మును యూఏఈ, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌కు తరలించి పెట్టుబడిగా పెట్టిందని అధికారులు వివరించారు.
పనామా పేపర్స్ కుంభకోణం గతేడాది వెలుగుచూసింది. మొత్తం 426 మందికి ఇందులో ప్రమేయం ఉండగా అందులో అత్యధికులు భారతీయులు, భారత సంతతికి చెందినవారు ఉండడం గమనార్హం. ఈ కుంభకోణంలో చిక్కుకునే నవాజ్ షరీఫ్ ప్రధాని పదవిని కోల్పోయారు.