Pawan Kalyan: సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మోదీకి ఏం చెబుతుందో తెలుసా?: పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు
- మోదీ, బీజేపీపై పవన్ విమర్శలు
- ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి సరైన కారణాలు చెప్పాలి
- రోడ్లపైకి వచ్చేందుకు కూడా సిద్ధమే
భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారశైలిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సున్నిత విమర్శలు చేశారు. గుజరాత్ లో వంద అడుగులు పైచిలుకు ఉండే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నరేంద్ర మోదీకి ఏం చెబుతుందో తెలుసా? అని ప్రశ్నించిన ఆయన... పార్లమెంటులో ఎలా పడితే అలా హామీలు ఇవ్వద్దని, ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోవాలని మోదీకి, బీజేపీకి ఆ విగ్రహం చెబుతుందని అన్నారు.
ప్రత్యేక హోదా అనేది చాలా సున్నితమైన అంశమని... దీనిపైన ఉద్యమం చేయాలనుకుంటే తాను చాలా బలంగా చేయగలనని పవన్ చెప్పారు. కానీ ఒక నాయకుడికి చాలా బాధ్యత ఉంటుందని అన్నారు. తాను రోడ్డు మీదకు వస్తే మీరంతా తన వెంట వస్తారని... కానీ, అదే సమయంలో మీ అమ్మానాన్నలకు, మీ అక్కాచెల్లెళ్లకు తాను సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ ఈ మేరకు స్పందించారు.
తొలుత తాను సామ, దాన, భేద విధానంలో పోరాడుతానని... ఆ తర్వాతే రోడ్లపైకి వస్తానని పవన్ అన్నారు. ఒక్క సమస్యను పరిష్కరించడం చాలా కష్టసాధ్యమైన విషయమని... ఈ పోరాటం వల్ల తనకు పిడికెడు లాభం కూడా లేదని చెప్పారు. రాజకీయ పార్టీలు మాట తప్పితే తనకు కోపం వస్తుందని... అలాంటప్పుడు తాను మౌనం వహించలేనని... అందుకే తాను ఇప్పుడు మీ ముందుకు వచ్చానని తెలిపారు.
రాజకీయ పార్టీలకు చేతకానప్పుడు హామీలు ఇవ్వరాదని... ఇచ్చిన మాటను తప్పితే, వారిని నిలదీసే సమయం కూడా వస్తుందని చెప్పారు. కేంద్రాన్ని తాను ఒకటే ప్రశ్నిస్తున్నానని... ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఇవ్వకపోవడానికి సరైన కారణాలను ఏపీ ప్రజలకు చెప్పాలని... ఆ కారణాలు అందరినీ తృప్తి పరిచేలా ఉండాలని అన్నారు.