Pawan Kalyan: కత్తి మహేష్ పై పరోక్షంగా సెటైర్ వేసిన పవన్ కల్యాణ్!

  • నన్ను విమర్శిస్తున్న వారు వారి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నట్టే
  • విమర్శలను నేను పట్టించుకోను
  • అనవసరంగా కొందరిని పెద్దవాళ్లను చేయొద్దు

తనపై విమర్శలు గుప్పిస్తున్న ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా సెటైర్ వేశారు. ఎవరైనా బలమైన గొంతును వినిపిస్తున్నప్పుడు విమర్శలు చేసేవాళ్లు ఉంటారని ఆయన అన్నారు. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని చెప్పారు. తాను బంగారాన్ని కాదని... తాను కూడా మనిషినేనని ఆయన అన్నారు.

తనలోని కొన్ని అంశాలు కొందరికి నచ్చుతాయని, కొన్ని అంశాలు కొందరికి నచ్చవని చెప్పారు. తనను ద్వేషించే వ్యక్తులు వారి అమూల్యమైన కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నట్టేనని తెలిపారు. మనిషి నవ్వితే కొంతమేర కండరాలు కదులుతాయని... ఒకరిని ద్వేషించే సమయంలో మాత్రం శరీరం మొత్తం ప్రభావితమవుతుందని... రక్తం పాడవుతుందని, ముఖంలోని కండరాలు పాడవుతాయని చెప్పారు. మీరు కూడా తనలాగానే ఉండాలని జనసేన కార్యకర్తలకు సూచించారు.

ప్రతి వ్యక్తికి సహనం ఉండాలని... అయితే, మనం చచ్చిపోయేంత సహనం మాత్రం అవసరం లేదని పవన్ అన్నారు. అంతటి సహనాన్ని తాను కూడా భరించలేనని చెప్పారు. మనం చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన అవసరం లేదని... అదే సమయంలో ఎదురుదాడి చేయాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. అవసరమైన సందర్భాల్లో స్వీయ రక్షణ చేసుకుందామని చెప్పారు.

ఎవరైనా విమర్శలు చేస్తున్నప్పుడు పట్టించుకోవద్దని... లేకపోతే, కొన్ని రోజుల తర్వాత అనవసరంగా కొందరిని పెంచి, పెద్దవాళ్లను ఎందుకు చేశామా? అనే మీకు అనిపిస్తుందని అన్నారు. తనను షబ్బీర్ అలీ, దానం నాగేందర్ లు కూడా తిడతారని... కానీ, ఎక్కడైనా ఎదురుపడితే చాలా బాగా మాట్లాడుకుంటామని చెప్పారు. తాను కూడా ఎందరినో ఏదేదో అంటుంటానని, ఆ తర్వాత వారితో మాట్లాడుతూనే ఉంటానని... ఎందుకంటే, అది బేసిక్ కర్టసీ అని తెలిపారు.

Pawan Kalyan
mahesh kathi
tollywood
janasena
  • Loading...

More Telugu News