Narendra Modi: మీకేది కావాలో ముందు చెప్పండి.. రామ మందిరమా? బాబ్రీ మసీదా?: కాంగ్రెస్‌కు మోదీ సూటిప్రశ్న
- కపిల్ సిబల్ వాదించేది మందిరం కోసమా? మసీదు కోసమా?
- 2019 ఎన్నికలకు, రామజన్మభూమికి లింకేంటి?
- నాలాగే మిమ్మల్ని కూడా ‘నీచ్’ అంటే ఊరుకుంటారా?
- ఎన్నికల ర్యాలీలో నిప్పులు చెరిగిన ప్రధాని
గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌కు సూటి ప్రశ్న వేశారు. బనస్కాంతలోని బాబర్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. రామమందిరం కావాలో.. బాబ్రీమసీదు కావాలో తేల్చుకోమని కాంగ్రెస్‌కు సూచించారు. 2019 ఎన్నికలకు, రామజన్మభూమి కేసుకు కాంగ్రెస్ ఎందుకు లింకు పెడుతోందని ప్రశ్నించారు.
రామమందిరం విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలను 2019 లోక్ సభ ఎన్నికల తర్వాతకు వాయిదా వేయాలని కాంగ్రెస్ తరపున కోర్టుకు హాజరైన కపిల్ సిబల్ అభ్యర్థించారు.
ప్రధాని మోదీ దీనిని ప్రస్తావిస్తూ కపిల్ సిబల్ రామమందిరం తరపున వాదిస్తున్నారా? లేక, బాబ్రీమసీదు తరపున వాదిస్తున్నారా? అన్న విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికలకు, కోర్టు వాదనలకు ఎందుకు ముడిపెడుతున్నారనే విషయాన్ని కాంగ్రెస్ ఇప్పటికీ చెప్పడం లేదని విమర్శించారు. అలాగే మణిశంకర్ అయ్యర్ తనపై చేసిన ‘నీచ్’ వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. తనలాగే మీరు కూడా ఇలా అవమానానికి గురైతే ఏం చేస్తారని ప్రజలను ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.