Liquor shop: జార్ఖండ్ ఎమ్మెల్యేల కొత్త కోరిక.. అసెంబ్లీ ప్రాంగణంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలని డిమాండ్!
- ఇటీవల మద్యం దుకాణాల లైసెన్స్‌ను రద్దు చేసిన ప్రభుత్వం
- సొంతంగా షాపులు తెరిచి విక్రయిస్తున్న సర్కారు
- చాంతాడంత క్యూలు.. తాము కొనుక్కోలేకపోతున్నామన్న శాసనసభ్యులు
జార్ఖండ్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని వింత కోరిక కోరారు. బయట మద్యం కొనుక్కోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని, క్యూలు భారీగా ఉండడంతో ఇబ్బందిగా ఉంటోందని, కాబట్టి అసెంబ్లీ ప్రాంగణంలోనే మద్యం దుకాణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌ను రద్దు చేసిన ప్రభుత్వం స్వయంగా దుకాణాలు తెరిచింది. ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉండడంతో ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటున్నాయి. దుకాణాల ముందు భారీగా క్యూలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి.
మద్యం దుకాణాల్లో ఎప్పుడు చూసినా క్యూలు కనిపిస్తున్నాయని, మద్యం కొనుగోలు ఇబ్బందిగా మారిందని, కాబట్టి అసెంబ్లీ ప్రాంగణంలోనే ఓ దుకాణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తుతామని అంటున్నారు. ఈ విషయంలో స్పీకర్ సాయం తీసుకుని ముఖ్యమంత్రిని ఒప్పిస్తామని ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు.