kulbhushan jadhav: కుల్‌భూషణ్ జాదవ్‌ని కలవనున్న తల్లి, భార్య.... వెల్లడించిన పాకిస్థాన్ విదేశాంగ శాఖ
- డిసెంబర్ 25న కలిసేందుకు ఏర్పాట్లు
- వారితో పాటు భారత ప్రతినిధి కూడా
- ఫలించిన సుష్మా స్వరాజ్ ప్రయత్నం
ఉగ్రవాదం, అక్రమ చొరబాటు నేరం మీద పాకిస్థాన్ మిలటరీ కోర్టు ఉరి శిక్ష విధించిన భారతీయ ఖైదీ కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు అతని తల్లి, భార్యను అనుమతిస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం వెల్లడించింది. డిసెంబర్ 25న భారత ప్రతినిధి వారధిగా వారిద్దరూ కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు అంగీకరించింది.
గత మే నెలలో భారత్ వేసిన కేసు మేరకు కుల్‌భూషణ్ జాదవ్ ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే నవంబర్‌లో అతని భార్యను కలిసేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. అయితే మానవతా దృక్పథంతో ఆలోచించి అతని తల్లికి కూడా జాదవ్‌ను కలిసేందుకు అనుమతివ్వాలని భారత విదేశాంగ శాఖ ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ విషయం గురించి భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్, పాకిస్థాన్ హై కమిషనర్‌తో ఇటీవల చర్చించారు. పాకిస్థాన్ తాజా ప్రకటనతో ఆమె చర్చలు ఫలించినట్లు అర్థం చేసుకోవచ్చు.