grade a: ఆటగాళ్ల వేతనాలు పెంచిన బీసీసీఐ...ఇప్పుడు విరాట్ కోహ్లీ జీతం ఎంతో తెలుసా?
- 2017-18కి కొత్త కాంట్రాక్టు అమలు చేయనున్న బీసీసీఐ
- రూ. 12 కోట్లకు చేరిన గ్రేడ్ ఏ ఆటగాళ్ల వార్షిక వేతనం
- గతంతో రూ. 2 కోట్ల వార్షిక వేతనం అందుకున్న గ్రేడ్ ఏ ఆటగాళ్లు
వార్షిక వేతనం విషయంలో భారత క్రికెటర్లు ప్రపంచంలో అత్యధిక వేతనం అందుకుంటున్నవారిలో ఒకరు. కేవలం ఆటగాళ్లే కాదు... కోచ్ రవిశాస్త్రికి కూడా చక్కని వేతనం అందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆటగాళ్ల వేతనం పెంచనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వారు ప్రకటించినట్లుగానే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
2017-18కి గాను కొత్త కాంట్రాక్టును బీసీసీఐ అమలు చేయనుంది. గ్రేడ్ ఏ, బీ, సీ... కేటగిరీల్లో బీసీసీఐ ఆటగాళ్లకు వేతనాలు ఇస్తుంది. కొత్త కాంట్రాక్టు ప్రకారం గ్రేడ్ ఏ ఆటగాళ్ల వార్షిక వేతనం రూ. 10 కోట్లు పెరిగింది. వీరికి గతంలో రూ. 2 కోట్ల వేతనం అందేది. అంటే మొత్తంగా గ్రేడ్ ఏ ఆటగాళ్లకు రూ. 12 కోట్ల వార్షిక వేతనం అందనుంది.
ఇక గ్రేడ్ బీ, సీ ఆటగాళ్లకు ఇప్పటివరకు వరుసగా రూ. 1 కోటి, రూ. 50 లక్షల చొప్పున వార్షిక వేతనం అందేది. కొత్త కాంట్రాక్టు ప్రకారం వారికి వరుసగా రూ. 8 కోట్లు, రూ. 4 కోట్ల చొప్పున వార్షిక వేతనం అందనుంది. గ్రేడ్ ఏలో విరాట్, ధోనీ, రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానే, చటేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, మురళీ విజయ్ ఉన్నారు.
గ్రేడ్ బీలో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, జస్ప్రీత్ బుమ్రా, యువరాజ్ సింగ్‌లు ఉన్నారు. ఇక గ్రేడ్ సీలో శిఖర్ ధావన్, అంబటి రాయుడు, అమిత్ మిశ్రా, మనీష్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్, యుజ్వేంద్ర చాహల్‌లు ఉన్నారు.