GST: కౌటిల్యుడి కాలం నాటి జీఎస్టీ గురించి వివరించండి.. బీహెచ్‌యూ విద్యార్థులకు షాకింగ్ క్వశ్చన్!

  • ఎంఏ ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులకు ప్రశ్న
  • సమర్థించుకున్న ప్రొఫెసర్
  • తత్వశాస్త్రాన్ని మరింతగా అర్థం చేసుకునే వీలుంటుందని వ్యాఖ్య

బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) నిర్వహించిన ఎంఏ మొదటి సెమిస్టర్ పరీక్షలో కనిపించిన ప్రశ్న చూసి విద్యార్థులు అవాక్కయ్యారు. ‘కౌటిల్యుడి కాలంనాటి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) గురించి వివరించండి?’ అనే ప్రశ్నతోపాటు ‘గ్లోబలైజేషన్‌ (ప్రపంచీకరణ)పై తొలి భారతీయ ఫిలాసఫర్ మనువు అభిప్రాయాన్ని గురించి రాయండి’ అన్న ప్రశ్నలు చూసి విద్యార్థులు అయోమయానికి లోనయ్యారు.

పరీక్షలో ఈ ప్రశ్నలు అడగడం గురించి బీహెచ్‌యూ ప్రొఫెసర్ కౌషల్ కిషోర్ మిశ్రా మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితులను నాటి పరిస్థితులతో పోల్చడం వల్ల తత్వశాస్త్రాన్ని మరింత అర్థం చేసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. ఈ టాపిక్ (అంశాన్ని) తాను గత నాలుగు దశాబ్దాలుగా విద్యార్థులకు బోధిస్తున్నట్టు చెప్పారు.

ఇక ఈ ప్రశ్న తమ పాఠ్యపుస్తకాల్లోనిది కాకపోయినా ప్రొఫెసర్ తమకు బోధించారని విద్యార్థులు చెప్పుకొచ్చారు. నోట్స్ కూడా తయారుచేసుకున్నామని వివరించారు. కౌటిల్యుడు, మను, శుక్రాచార్యుల గురించి తమ పుస్తకాల్లో ఉందని, అయితే కౌటిల్యుడికి నేటి జీఎస్టీతోను, మనువుకి గ్లోబలైజేషన్ తోను ముడిపెట్టి ప్రశ్నలు అడగడం మాత్రం ప్రొఫెసర్ సొంత ప్రయోగమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News