Pawan Kalyan: జగన్ నాన్నలా కోట్లు, లోకేశ్ తండ్రిలా పాల ఫ్యాక్టరీ మా నాన్న నాకు ఇవ్వలేదు!: పవన్ కల్యాణ్ సెటైర్లు
- జగన్, లోకేశ్‌లపై జనసేన చీఫ్ విమర్శలు
- ముఖ్యమంత్రి అయ్యాకే తిండి పెడతానంటే ఎలా అంటూ జగన్‌కు సూటి ప్రశ్న
- తనకు అధికార యావ లేదన్న పవన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, మంత్రి అయిన లోకేశ్‌లపై జనసేన చీఫ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘చలొరే చలొరే చల్’ పర్యటనలో భాగంగా గురువారం ఆయన రాజమహేంద్రవరంలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ సుదీర్ఘంగా మాట్లాడారు. జగన్, లోకేశ్‌లపై విమర్శలు గుప్పించారు.
తాను బయట ఉండే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే, ప్రతిపక్షంగా ఉండి ఏమీ చేయలేకపోతున్నారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. సీఎం అయ్యాకే ప్రజా సమస్యలు పరిష్కరిస్తానంటే కుదరదని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాకే అన్నం పెడతానంటే ఎలా? అని ప్రశ్నించారు.
జగన్‌కు వాళ్ల తండ్రి రాజశేఖరరెడ్డి ఇచ్చినట్టు తన తండ్రి తనకు కోట్లు ఇవ్వలేదని పవన్ అన్నారు. అలాగే లోకేశ్‌కు వాళ్ల నాన్న పాల ఫ్యాక్టరీ ఇచ్చినట్టు తనకు తన తండ్రి ఇవ్వలేదని అన్నారు. తనకు అధికార దాహం లేదని, పిచ్చి అంతకంటే లేదని పేర్కొన్న పవన్.. తనకు అదే కనుక ఉంటే ఈ పాటికే అనకాపల్లి నుంచి ఎంపీని అయి ఉండేవాడినన్నారు.
తనకు డబ్బులు ఇస్తామని చాలామంది వచ్చారని, వాటిని తీసుకుని అమ్ముడుపోవాలని అనుకోలేదని పేర్కొన్నారు. డబ్బులు తీసుకుంటే ప్రజలకు తనమీద నమ్మకం, విశ్వాసం ఎలా ఉంటాయని అన్నారు. ఈ రోజు ఏ ముఖ్యమంత్రిని అడిగినా ఓట్లు కొనలేకపోతున్నామంటున్నారని, అసలు ఓట్లను ఎందుకు కొనాలని పవన్ ప్రశ్నించారు.