Virat Kohli: ఇక నాకు విశ్రాంతి కావాలి: విరాట్ కోహ్లీ
- రెండేళ్లుగా అవిశ్రాంత క్రికెట్
- గతంలో రెస్ట్ లభిస్తే భారంగా రోజులు గడిచాయి
- ఇప్పడు అలసిపోయి విశ్రాంతి కోరుకుంటున్నా
- భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ
గడచిన రెండు సంవత్సరాలుగా తాను అవిశ్రాంత క్రికెట్ ను ఆడుతున్నానని, ఇక తనకు విశ్రాంతి కావాలని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. గతంలో తనకు రెస్ట్ లభించినప్పుడు రోజులు చాలా భారంగా గడిచాయని, ఇప్పుడు మాత్రం శరీరం విశ్రాంతిని బలంగా కోరుతోందని అన్నాడు. 48 నెలలుగా తనపై వర్క్ లోడ్ ఎంతో పెరిగిందని, తాను అలసిపోయానని, సౌతాఫ్రికా టూర్ కు వెళ్లే ముందే విశ్రాంతి తీసుకోవాల్సి వుందని, ఇదే సరైన సమయమని భావిస్తున్నానని అన్నాడు.
కాగా, శ్రీలంకతో టెస్టు సిరీస్ తరువాత, వన్డే, టీ-20 సిరీస్ ల నుంచి కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. నిన్న శ్రీలంకతో టెస్టు మ్యాచ్ డ్రా అనంతరం మాట్లాడిన కోహ్లీ, తాను వన్డేల్లో పరుగులు చేసినంత వేగంగా టెస్టుల్లో పరుగులు సాధించలేనని చెప్పాడు. దక్షిణాఫ్రికా టూర్ ఆటగాళ్లకు మంచి అనుభూతిని మిగులుస్తుందని భావిస్తున్నట్టు తెలిపాడు. సరిగ్గా ఆడితే ఏ ఫార్మాట్ లోనైనా విజయావకాశాలు ఉంటాయని అన్నాడు.