Narendra Modi: గుజరాత్ పీఠం మళ్లీ బీజేపీదే.. కాకపోతే తేడా అంతంతే!: ఒపీనియన్ పోల్స్
- వరుసగా ఐదోసారి గుజరాత్ పీఠాన్ని అధిష్ఠించనున్న బీజేపీ
- కాంగ్రెస్, బీజేపీకి మధ్య స్వల్ప తేడా
- మూడు సర్వేలూ చెబుతున్నది ఇదే
గుజరాత్ పీఠం మళ్లీ బీజేపీదేనని ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన మూడు సర్వేల్లో ఇదే విషయం వెల్లడైంది. రాష్ట్రంలోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 105 నుంచి 106 స్థానాలను గెలుచుకుంటుందని ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. అధికారానికి 92 సీట్లు అవసరం కాగా కేవలం స్వల్ప ఆధిక్యంతో అధికారాన్ని చేజిక్కించుకోనుంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ ఇక్కడ వరుసగా ఐదోసారి అధికారం చలాయించనుంది. కాగా, కాంగ్రెస్ 73 నుంచి 74 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కానుంది.
ఇండియా టీవీ సర్వేలో బీజేపీకి 106 నుంచి 116 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేలగా, బీజేపీ 111 స్థానాలు గెలుచుకుంటుందని టౌమ్స్ నౌ సర్వే పేర్కొంది. అధికార పార్టీ 91 నుంచి 99 స్థానాలకే పరిమితమవుతుందని ఏబీపీ-సీఎస్‌డీఎస్ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ బాగా పుంజుకుంటుందని మూడు సర్వేలు తేల్చి చెప్పాయి. ఆ పార్టీకి 63 నుంచి 73 సీట్లు వస్తాయని ఇండియా టీవీ పేర్కొనగా 68 స్థానాలు కాంగ్రెస్ పరం కానున్నాయని టౌమ్స్ నౌ అంచనా వేసింది. 78 నుంచి 86 స్థానాలను కాంగ్రెస్ చేజిక్కించుకుంటుందని ఏబీపీ-సీఎస్‌డీఎస్ అంచనా వేసింది. కాగా, 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 60 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 116 స్థానాల్లో విజయం సాధించింది.