Pawan Kalyan: నేను అందుకే రాజకీయాల్లోకి వచ్చాను: పవన్
- రాజకీయాల్లోకి వస్తానని అమ్మానాన్నతో 2003లో చెప్పాను
- కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలి
- నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చాను
- రాజకీయ వ్యవస్థ బాగుంటే నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు
సినిమాల వల్ల వ్యవస్థలో మార్పురాదని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖపట్నంలో పర్యటిస్తోన్న పవన్ కల్యాణ్ తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తాము వ్యవస్థలో సమూల మార్పులు చేయలేకపోవచ్చు కానీ, కొంతయినా మార్చుతామని అన్నారు. తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని 2003లో తన అమ్మానాన్నలకి చెప్పానని అన్నారు. తాను బీజేపీ, టీడీపీ పక్షం కాదని ప్రజల పక్షం అని అన్నారు.
సినిమా తనకు అన్నం పెట్టిందని, రాజకీయ వ్యవస్థ బాగుంటే తాను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదని పవన్ చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ఏదో సాధించడానికి కాదని అన్నారు. తన మనస్సాక్షికి సమాధానం చెప్పుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తనకు లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ పటేల్, నెహ్రూ, అంబేద్కర్ స్ఫూర్తి అని అన్నారు. మన ఆలోచనలు వేరు వేరుగా ఉండొచ్చని, లోపల తపన మాత్రం ఒకటే ఉంటుందని అన్నారు. జగమంత కుటుంబం మనది, వసుదైక కుటుంబం మనది అని ఆయన చెప్పుకొచ్చారు. దేశ రాజకీయాలకు కొత్త రక్తం కావాలని అన్నారు. మారాలని చెబితే ఎవ్వరూ మారరని, మనం మంచి దారిలో నడిచి చూపిస్తే మనల్ని చూసి మారతారని అన్నారు.