Pawan Kalyan: 'సీఎం..సీఎం' అంటే మీకు ఆనందంగా ఉంటుందేమో... నాక్కాదు!: పవన్ కల్యాణ్
- 2019 ఎన్నికల్లో ఓట్లగే హక్కు ఏ రాజకీయ నాయకుడికీ లేదు
- డీసీఐని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు?
- బీజేపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు ఏం చేస్తున్నారు?
"ఎంపీలు, ఎమ్మెల్యేలు తప్పించుకోవచ్చు కానీ, ఆ రోజు ఓట్లడిగిన నేను మాత్రం ఈ రోజు తప్పించుకోను. అందుకే మీ ముందుకు వచ్చాను. అందుకే నేను స్పందిస్తున్నాను. రాజకీయాల్లోకి వచ్చిన రోజే చెప్పాను. మీరు ఓట్లేయండి, మీ తరపున నేతలను నేను నిలదీస్తాను' అని.. అందుకే వచ్చాను. ఇప్పుడు అడుగుతున్నాను" అంటూ జనసేన అధినేత పవన్ ఉద్వేగంగా మాట్లాడారు.
విశాఖపట్టణంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "లాభాల్లో ఉన్న డీసీఐని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు? ఎందుకు ప్రైవేటు పరం చేయకూడదో ప్రధానికి లేఖ రాస్తాను. జీవన్మరణ సమస్యగా పోరాడుతున్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు ప్రజలను పట్టించుకోవడం లేదు. ఓట్లడిగేటప్పుడు ప్రజలే దేవుళ్లు అని ఇంటింటికి వెళ్లి, సమస్యలు వచ్చినప్పుడు ప్రజల్ని పట్టించుకోని నేతలకు ఓట్లడిగే హక్కులేదు. లేదు..లేదు... 2019 ఎన్నికల్లో ప్రజలను ఓట్లడిగే హక్కు ఏ రాజకీయ నాయకుడికి లేదు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకు సమస్యలు ఎదురైతే నేను ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని ఆశ్రయించలేదు. ఎందుకంటే సమస్యలను ఎదుర్కోవడం నాకు తెలుసు.
ఆ ధైర్యం నాకు ఉంది. నాకు భయాలు లేవు. ప్రాణం మాత్రమే ఉంది. మీకోసం అవసరమైతే జైలుకెళ్తాను. మీకోసం దెబ్బలు తింటాను, రక్తం కారుస్తాను. 2014 సభలో మోదీ కానీ, చంద్రబాబు కానీ నాకు బంధువులు కాదని చెప్పాను. నాకు బంధువులైనా, స్నేహితులైనా మీరే... ఈ రోజు వరకు నేను ఎవర్నీ ఏమీ అడగలేదు. ఈ రోజు నేను అడిగేది ఒక్కటే. డీసీఐ సమస్యలను బీజేపీ ఎంపీలు గంగరాజు, హరిబాబు, ఇతర ఎంపీలు అవంతి శ్రీనివాస్, అశోక్ గజపతి రాజులు కేంద్రం ముందుకు తీసుకెళ్లాలి. 2014 ఎన్నికల్లో వైజాగ్ ఎంపీగా నిలబడి గెలిచే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడిని, అయినా నేను ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకు ఇతర పార్టీలకు ప్రచారం చేశాను?" అన్నారు.
ఈ సందర్భంగా 'సీఎం...సీఎం' అంటూ నినాదాలు చేయడంతో అసహనం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, " సీఎం సీఎం అంటే మీకు ఆనందంగా ఉంటుందేమో.. నాకు కాదు. నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. నేను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. పదవులు రాకపోతే ప్రజలకు సేవ చెయ్యడం మానేస్తామా? ప్రజా సమస్యలపై పోరాడడం మానేస్తామా? లేదు.. నేను అందుకు రాజకీయాల్లోకి రావడం లేదు. పదవుల కోసం రావడం లేదు. పదవులే రాజకీయాల పరమావధి కాదు. కీడెంచి మేలెంచండి... నినాదాలు చేయడం వల్ల నాకు ఆనందం కలుగదు" అంటూ ఆయన అభిమానులకు సున్నితనగా హితవు పలికారు.
అనంతరం తన ప్రసంగం కొనసాగిస్తూ, ఎవరో చేసిన తప్పుకు మరెవరో శిక్ష అనుభవిస్తున్నారు. ఫైనాన్షియల్ క్రైమ్స్ చేసేది ఒకరు, సమస్యల్లో చిక్కుకునేది ఇంకొకరు. డీసీఐలో ఎవరో చేసిన తప్పుకు వెంకటేష్ శిక్షించబడ్డాడు. ఇది సరైన విధానమేనా? ఇలా జరగొచ్చా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు నేతలను నిలదీస్తే ఏ నేతా తప్పించుకుని వెళ్లలేడని ఆయన అన్నారు. దానికి తాను కూడా అతీతుడ్ని కాదని ఆయన అన్నారు. భవిష్యత్ లో ఇలాంటి సమస్యలే తనకు ఎదురైనా పారిపోనని ఆయన చెప్పారు. తొలిసారి డీసీఐ ఉద్యోగుల తరపున ప్రధానికి లేఖ రాస్తున్నానని ఆయన చెప్పారు. డీసీఐని ప్రైవేటు పరం చేస్తే బీజేపీ పతనం వైజాగ్ నుంచి ప్రారంభమవుతుందని ఆయన హెచ్చరించారు.