Recording Dancer: డ్యాన్సులకు అడ్డొస్తోందని.. రెండేళ్ల కూతురిని హత్య చేయించిన రికార్డింగ్ డ్యాన్సర్!
- మద్యం మత్తులో ఘాతుకం
- డ్యాన్సులు చేస్తుంటే జ్వరంతో ఏడుస్తున్న పాప
- హత్య చేయాలని ప్రియుడిని కోరిన డ్యాన్సర్
- కేసును ఛేదించిన పోలీసులు
తన వృత్తికి అడ్డొస్తోందన్న ఆగ్రహంతో ప్రియుడితో కలసి కన్న బిడ్డను హత్య చేసిందో యువతి. చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఐరాల మండలానికి చెందిన శాంత (22) రికార్డింగ్ డ్యాన్సర్. నాలుగేళ్ల క్రితం బోయకొండ అనే యువకుడిని పెళ్లాడి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత, అతన్ని వదిలేసింది. ఆపై మదనపల్లికి చెందిన డ్యాన్స్ గ్రూప్ లో చేరి, అదే గ్రూప్ లో డ్యాన్సులు చేసే శ్రీనివాసులుతో సహజీవనం సాగిస్తోంది.
వీరిద్దరూ కలసి పల్లెల్లో రికార్డింగ్ డ్యాన్సులు చేసి, ఆ ఆదాయంతో బతుకుతున్నారు. ఈ క్రమంలో గత నెల 23న పుంజనూరు మండలం సుగాలిమిట్టకు వెళ్లిన ఇద్దరూ, తన వెంట జ్వరంతో బాధపడుతున్న రెండేళ్ల శివానిని కూడా తీసుకెళ్లారు. ఆపై మద్యం తాగి, ఒళ్లు తెలియకుండా డ్యాన్సులు వేస్తున్న వీరికి, జ్వరంతో బాధపడుతున్న బిడ్డ ఏడుపు అడ్డు వచ్చింది. దీంతో ఆగ్రహించిన శాంత, పాపను చంపేయాలని చెప్పడంతో, వెంటనే శ్రీనివాసులు ఆ చిన్నారి గొంతు పిసికి, ఆటో కమ్మీకి బలంగా కొట్టాడు. దీంతో పాప అక్కడికక్కడే మరణించగా, మృతదేహానికి దుప్పటి చుట్టి మురుగు కాలువలో పడేశారు. మరుసటి రోజు పత్రికల్లో చిన్నారి మృతి విషయం వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు, విచారించి శాంత, శ్రీనివాసులును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.