Narendra Modi: సర్దుకుంటున్నారు... నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలపై 'ఓఖి' తుపాను ప్రభావం!
- నేతల ఎన్నికల ప్రచారంపై తుపాను దెబ్బ
- పలు ర్యాలీలు రద్దు
- పరిమితంగా సాగుతున్న తుది దశ ప్రచారం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ, నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ వంటి నేతలు ఓట్ల కోసం కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ జోరుగా ప్రచారం సాగిస్తుండగా, అరేబియా సముద్రం వైపు నుంచి దూసుకొచ్చిన ఓఖి తుపాను, వారికి బ్రేకులేసింది. మంగళవారం అర్ధరాత్రికి గుజరాత్ తీరానికి ఓఖీ చేరడంతో మోదీతో పాటు రాహుల్ గాంధీ తదితరులు తమ ఎన్నికల ప్రచారాన్ని సర్దేశారు.
నరేంద్ర మోదీ సూరత్ ర్యాలీని రద్దు చేసుకుని ధండుకా, దహోద్, నేత్రంగ్ ప్రాంతాలకు పరిమితం కానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇక బీజేపీ చీఫ్ అమిత్ షా షిహోర్ లో ర్యాలీ, బహిరంగ సభలను రద్దు చేసుకోగా, కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోర్బి, దర్బంగా, సురేంద్రనగర్ ర్యాలీలు రద్దు చేసుకున్నారు. కాగా, తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారిందని, అయినప్పటికీ, గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారి జయంత్ సర్కార్ తెలిపారు.