Vijay Malya: నా తప్పు లేదు... మోసం అంతకన్నా లేదు... జరిగిందిది!: లండన్ కోర్టులో విజయ్ మాల్యా
- వ్యాపారంలో నష్టం వస్తే నేనేం చేసేది?
- క్రూడాయిల్ ధరల పెరుగుదలతో తీవ్ర నష్టం
- వ్యక్తిగతంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు
- లండన్ కోర్టులో విజయ్ మాల్యా వాదనలు
ఇండియాలోని ఏ ఒక్క బ్యాంకును కూడా తాను మోసం చేయలేదని యూబీ గ్రూప్ మాజీ చైర్మన్, రూ. 9 వేల కోట్లకు పైగా రుణాలు చేసి, వాటిని తీర్చకుండా బ్రిటన్ పారిపోయిన విజయ్ మాల్యా పాతపాటే పాడారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్స్ కోర్టులో తన అప్పగింతపై వాదనలు జరుగుతున్న వేళ, మాల్యా రుణాలు ఎప్పుడు, ఎలా తీసుకుని ఎలా ఖర్చు పెట్టారన్న విషయాన్ని ఈడీ, సీబీఐ అధికారుల తరఫు ప్రాసిక్యూషన్ సవివరంగా చెబుతున్న సమయంలో, పలుమార్లు మాల్యా తరఫు న్యాయవాదులు అడ్డుకున్నారు.
తమ క్లయింట్ ఏ ఒక్క రూపాయిని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదని, అవి ఓ కంపెనీ పేరిట తీసుకున్నవని వాదిస్తూనే, ఆయన ఎవరినీ మోసం చేయలేదని అన్నారు. కింగ్ ఫిషర్ కోసం రుణాలు తీసుకోక ముందు, ఆ తరువాత క్రూడాయిల్ ధరలు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు పెరిగిన తీరు, ఈ రంగంలో నెలకొన్న పోటీని వివరిస్తూ, తన వ్యాపారం విఫలమైందని, తానే ఎంతో నష్టపోయానని చెప్పించారు. వ్యాపారంలో నష్టాలు వస్తే తానేం చేయగలనని వాదించారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయస్థానం, కేసు విచారణను వాయిదా వేసింది. విజయ్ మాల్యాను ఎలాగైనా ఇండియాకు తీసుకురావాలని లండన్ వెళ్లిన ప్రత్యేక సీబీఐ, ఈడీ బృందాలు తదుపరి దశలో మరింత గట్టిగా వాదనలు వినిపించడంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా మరిన్ని ఆధారాలను సమర్పించనున్నట్టు తెలుస్తోంది.