rama mandir: అయోధ్యలో రామమందిరంపై మహంత్ నృత్య గోపాల్ దాస్ వివాదాస్పద వ్యాఖ్యలు!
- అయోధ్య వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టులో ఈ రోజు వాదనలు.. వాయిదా
- తీర్పు మాకు ప్రతికూలంగా వచ్చినా రామ మందిరం నిర్మిస్తాం
- మోదీ, యోగీ సాయం తీసుకుని కట్టేసి తీరుతాం
- మెజారిటీ ప్రజలు రామ మందిరాన్ని కోరుకుంటున్నారు
అయోధ్య రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ భూవివాదం కేసులో ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు వచ్చే ఏడాది ఫ్రిబ్రవరి 8కి వాయిదా వేయడంపై రామజన్మభూమి న్యాస్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ స్పందించారు. న్యాయస్థానం తీర్పు తమకు ప్రతికూలంగా వచ్చినప్పటికీ రామ మందిర నిర్మాణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆ స్థలం రాముడికి సంబంధించినదని, తాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ల సాయంతో రామమందిర నిర్మాణం చేపట్టి తీరతామని తేల్చి చెప్పారు. భారత్‌లోని మెజారిటీ ప్రజలు అయోధ్యలో రామాలయాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు కూడా ప్రజల మనోభావాలను గుర్తిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.