apcc: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ అందించిన ఏపీసీసీ!
- ఈ ప్రాజెక్టు ఏపీకి చాలా అవసరం
- సాగు, తాగునీరు అందుతుంది
- నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలి
పోలవరం ప్రాజెక్టుపై ఏర్పడిన గందరగోళంపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి లేఖ అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లాంటి ప్రాంతాలకు వ్యవసాయ, తాగునీటి అవసరాలు తీరుతాయని అందులో పేర్కొన్నారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని చెప్పారని అన్నారు. ఈ విషయంపై అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటన కూడా చేశారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తికావడం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో అవసరమని, కేంద్ర ప్రభుత్వం నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలని తాము కోరుతున్నామని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రిని కలసిన అనంతరం మీడియాతో రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ, వైసీపీ ఈ అంశాన్ని లేవనెత్తాలని డిమాండ్ చేశారు. పోలవరం అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తితే తాము కూడా అందుకు సహకరిస్తామని చెప్పారు.