pilot: పైలట్ చేసిన పొరపాటుతో.. వేరే ఎయిర్‌పోర్టులోకి దిగబోయిన విమానం!
- ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టులో దిగాల్సిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం
- దానికి కిలోమీటర్ దూరంలో ఉండే జుహూ విమానాశ్రయ రన్‌వేపైకి..
- పైలట్‌ను వెంటనే అప్రమత్తం చేసిన ఎయిర్‌పోర్టు సిబ్బంది
ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టులో దిగాల్సిన ఓ విమానం పైలట్ తప్పిదం కారణంగా అదే నగరంలోని జుహూ ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగడానికి ప్రయత్నించి అలజడి రేపింది. ఛత్రపతి శివాజీ విమానాశ్రయ రన్‌వే, జుహూ విమానాశ్రయ రన్‌వే సుమారు కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి. జుహూ రన్‌వే చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ రన్‌వేపై చిన్న విమానాలు మాత్రమే దిగడానికి వీలుంటుంది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో పైలట్ ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ అధికారులతో సంప్రదింపులు కూడా జరిపాడు.
అయినప్పటికీ పైలట్ పొరపాటున జుహూ రన్‌వే వైపుగా విమానాన్ని దారి మళ్లించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ విమానాశ్రయానికి విమానం చేరుకుంటుండగా ఎయిర్‌ట్రాఫిక్ సిబ్బంది వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేయడంతో విమానాన్ని తిరిగి ఛత్రపతి శివాజీ విమానాశ్రయం రన్‌వేపైకి తీసుకెళ్లాడు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ విమానం సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందినదని సంబంధిత అధికారులు చెప్పారు.