India: మైదానంలోనే వాంతులు చేసుకుంటున్న లంక క్రికెటర్లు!
- ఢిల్లీలో టెస్టు మ్యాచ్ పై కాలుష్యపు పడగ
- స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న లక్మల్ కు తీవ్ర ఇబ్బంది
- మైదానంలో వాంతి చేసుకుని వీడిన క్రికెటర్
- 248కి పెరిగిన భారత్ లీడ్
ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయికి కాలుష్యం చేరిన వేళ, ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఇండియాతో టెస్టు మ్యాచ్ ఆడుతున్న శ్రీలంక క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఇండియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తుండగా, స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న సురంగ లక్మల్ మైదానంలోనే వాంతి చేసుకున్నాడు. ఆ వెంటనే మైదానంలోకి వచ్చిన జట్టు ఫిజియో, అతన్ని బయటకు తీసుకెళ్లగా, ఆ స్థానంలో సబ్ స్టిట్యూట్ గా షనాక మైదానంలోకి వచ్చాడు.
నిన్న లంక క్రికెటర్లు డ్రస్సింగ్ రూములో వాంతులు చేసుకున్నట్టు మేనేజర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కాలుష్యంపై స్పందించిన బీసీసీఐ, ఇకపై ఢిల్లీలో చలికాలంలో మ్యాచ్ లు నిర్వహించే ముందు కాలుష్యాంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, నాలుగో రోజు ఆటలో పలువురు లంక ఆటగాళ్లు మాస్క్ లు లేకుండానే ఆడుతుండటం గమనార్హం.
164 పరుగులు చేసిన చండీమల్ రెండు రోజుల పాటు మాస్క్ లేకుండానే ఆడగా, కీపర్ డిక్ వెల్లా సైతం ఎలాంటి మాస్క్ నూ ధరించలేదు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో భారత స్కోరు 26 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు కాగా, లీడ్ 248 పరుగులకు పెరిగింది. పుజారా 38, ధావన్ 25 పరుగులతో ఆడుతున్నారు.