Andhrajyoti: 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!
- జగన్, మోదీ కలవడంపై 'ఆంధ్రజ్యోతి'లో కథనాలు
- పరువు నష్టం దావా వేసిన వైకాపా నేత ఆర్కే
- కోర్టుకు హాజరు కాని రాధాకృష్ణ
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే వేసిన పరువు నష్టం కేసులో పదేపదే కోర్టుకు గైర్హాజరు అవుతున్న 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఎండీ రాధాకృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్లను నాంపల్లి కోర్టు జారీ చేసింది. ఈ కేసులో రాధాకృష్ణతో పాటు మరో ఆరుగురు నిందితులు ఉండగా, వారంతా కోర్టుకు రావడంతో ఒక్కొక్కరూ రూ. 10 వేల పూచీకత్తును చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
గతంలో వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు, 'ఆంధ్రజ్యోతి' పత్రిక తప్పుడు కథనాలు రాసిందన్నది ఆర్కే అభియోగం. ఈ కథనాలపై ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేయగా, ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది. రాధాకృష్ణ వరుసగా కోర్టుకు గైర్హాజరు అవుతుండటంపై న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఎన్బీడబ్ల్యూ జారీ చేశారు.