Anantapur: రేయ్.. నాది జమ్మలమడుగు.. తిక్కరేగిందా.. బాంబులేస్తా: అధికారిపై దాడిచేసి, ముఖంపై కాలుపెట్టి హెచ్చరించిన కాంట్రాక్టర్!
- సినిమా స్టైల్లో అధికారి ముఖంపై కాలువేసి హెచ్చరించిన కాంట్రాక్టర్
- మందీమార్బలంతో కార్యాలయానికి వచ్చి మరీ బెదిరింపు
- పోలీసులకు ఫిర్యాదు.. అధికారికి మద్దతు పలికిన పలువురు కాంట్రాక్టర్లు
అనంతపురంలో సోమవారం రాత్రి దారుణం జరిగింది. డీఈ స్థాయి అధికారిపై ఓ కాంట్రాక్టర్ చిందులు తొక్కాడు. సినిమా స్టైల్లో ఆయన ముఖంపై ఎగిరి తన్ని ‘‘రేయ్! నాది జమ్మలమడుగు. నాతో పెట్టుకోవద్దు. నాక్కానీ తిక్కరేగిందా ఆఫీసుపై బాంబులేస్తా’’ అని బెదిరించడం సంచలనం రేపుతోంది.
అనంతపురం నగరపాలక సంస్థలో కిష్టప్ప డిప్యూటీ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. నరసింహారెడ్డి కాంట్రాక్టర్. రోడ్లపై చెత్త ఊడ్చే యంత్రాన్ని మునిసిపాలిటీకి ఆయన సరఫరా చేశారు. ఈ యంత్రానికి గాను ఇటీవల నగరపాలక సంస్థ రూ.23 లక్షలను నరసింహారెడ్డికి చెల్లించగా మరో రూ.15 లక్షలు ఇంకా చెల్లించాల్సి ఉంది. అయితే ఈ యంత్రంపై ఆరోపణలు రావడంతో బిల్లుల చెల్లింపును కిష్టప్ప నిలిపివేశారు.
బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని ప్రశ్నించేందుకు కార్యాలయానికి చేరుకున్ననరసింహారెడ్డి రావడం రావడమే ఇంజినీర్లతో వాగ్వాదానికి దిగారు. దుర్భాషలాడారు. అక్కడే ఉన్న కిష్టప్ప మర్యాదగా మాట్లాడాలని ఆయనకు హితవు పలికారు. దీంతో రెచ్చిపోయిన నరసింహారెడ్డి ‘నువ్వెవరు చెప్పడానికి?’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. డిప్యూటీ కమిషనర్ సన్యాసిరావు, కార్యదర్శి జ్యోతిలక్ష్మిలు కూడా ఆయనను మందలించారు.
ఈ ఘటన జరిగిన గంట తర్వాత బైక్పై ఇంటికి వెళ్తున్న కిష్టప్పను మార్గమధ్యంలో అడ్డుకున్న నరసింహారెడ్డి విచక్షణ రహితంగా దాడిచేశాడు. ముఖంపై కాలుపెట్టి బూతులు తిట్టాడు. తనది జమ్ములమడుగు అని, ఆఫీసుపై బాంబులేస్తానని హెచ్చరించాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనకు మద్దతుగా నగరపాలక సిబ్బందితోపాటు కాంట్రాక్టర్లు పోలీస్ స్టేషన్కు తరలివెళ్లారు. అధికారులపై దాడులను సహించబోమని, ఎస్పీని కలిసి నరసింహారెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తామని కమిషనర్ మూర్తి తెలిపారు.