Chandrababu: నవ్యాంధ్రలో పెట్టుబడులకు ముందుకొచ్చిన కొరియా పరిశ్రమలు.. తొలి రోజు రెండు ఒప్పందాలు

  • ఏపీలో పెట్టుబడులకు పలు కంపెనీల ఆసక్తి
  • అనంతపురంలో వెయ్యి ఎకరాల్లో కొరియన్ సిటీ
  • అమరావతి, అనంతపురంలో హోటళ్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన ‘లొట్టె’

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి రోజు బిజీబిజీగా గడిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సియోల్ చేరుకున్న చంద్రబాబు తొలి రోజు పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పరిశ్రమల స్థాపనకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి.

తొలి రోజు రెండు ఒప్పందాలు కుదిరాయి. అనంతపురం జిల్లాలో వెయ్యి ఎకరాల్లో కొరియా సిటీ నిర్మించేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది. చాక్లెట్ తయారీ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన లొట్టె.. అనంతపురం, అమరావతిలో హోటళ్లు, ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ వాంగ్‌ కాగ్‌ జు పేర్కొన్నారు.

 ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీని దక్షిణ కొరియాకు రెండో రాజధానిగా భావించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కియా సీఈవో హ్యూంగ్ కిన్ లీ మాట్లాడుతూ తమ సంస్థ విద్యుత్ వాహనాల తయారీని ప్రారంభించిందని, ఒకసారి చార్జింగ్ చేస్తే 170 కిలోమీటర్లు ప్రయాణించేలా వాహనాలను తయారుచేసినట్టు చంద్రబాబుకు తెలిపారు. అమరావతిలో విద్యుత్ వాహనాల వినియోగానికి తమకు సహకరించాలని కోరారు.

అనంతపురంలో వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న కొరియా సిటీ కోసం తొలి దశలో 700 ఎకరాలు సేకరిస్తారు. మూడు దశల్లో మొత్తం రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 37 సంస్థలు ముందుకొచ్చాయి. వీటి ద్వారా తొలుత ప్రత్యక్షంగా, పరోక్షంగా 9 వేల మందికి ఉపాధి లభిస్తుంది. మూడు దశలు పూర్తయ్యాక మొత్తంగా 40 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ సిటీకి మొత్తం వందకు పైగా కొరియా సంస్థలు వస్తాయని అంచనా.

  • Loading...

More Telugu News