Andhra Pradesh: రిజర్వేషన్లపై మోదీ వ్యాఖ్యలు.. తెలుగు రాష్ట్రాల్లో అనుమానాలు!
- రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది
- తెలంగాణలో ముస్లింలకు 12 శాతం.. ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు
- బిల్లుల ఆమోదంపై అనుమానాలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం హోరెత్తుతోంది. పటీదార్ అనామత్ ఆందోళన్ సంస్థ తమకు రిజర్వేషన్లు కావాలంటూ గతంలో పెద్దఎత్తున పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలిస్తామన్న బీజేపీ దానిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ వారికి రిజర్వేషన్ల హామీని ఇచ్చింది. దీంతో ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు.
ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మాట్లాడుతూ, 'యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెబితే అది తప్పుడు హామీయే అవుతుంద'ని అన్నారు. అంటే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం పరిమితిని దాటడం వీలుపడదని స్పష్టం చేశారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులిద్దరూ సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం రిజర్వేషన్ల పరిమితిని దాటే నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కాపు సామాజిక వర్గానికి 5 శాతం రిజర్వేషన్ ప్రకటించగా, తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన ఈ రిజర్వేషన్ల బిల్లులు కార్యరూపం దాల్చుతాయా? అన్న అనుమానాలు నెలకొన్నాయి.