vishal: విశాల్ కు శుభాకాంక్షలు చెప్పిన కేజ్రీవాల్, ఖుష్బు
- ఆర్కేనగర్ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన విశాల్
- రాజకీయాల్లోకి ఆహ్వానించిన కేజ్రీవాల్, ఖుష్బు
- కృతజ్ఞతలు చెప్పిన విశాల్
కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్ రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో విశాల్ పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. జయలలిత సమాధి వద్దకు వెళ్లి ఆయన నివాళులర్పించిన అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విశాల్ కు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ‘రాజకీయాల్లో నీ ఆగమనం మరింతమంది యువకులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నువ్వు ఢిల్లీ వచ్చినప్పుడు కలుద్దాం’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి విశాల్ కృతజ్ఞతలు తెలిపాడు.
అలాగే సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ సుందర్ కూడా ఆయనకు ట్విట్టర్ మాధ్యమంగా శుభాకాంక్షలు చెబుతూ, రాజకీయాల్లోకి ఆహ్వానం పలికారు. కాగా, నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విశాల్ మాట్లాడుతూ, తాను పూర్తి స్థాయి రాజకీయనాయకుడిని కాదని అన్నారు. తనకు దీర్ఘ కాలిక ప్రణాళికలు కూడా లేవని చెప్పారు. అయితే ఆర్కేనగర్ ప్రజల ప్రతినిధిగా వారి గొంతు అవ్వాలనుకుంటున్నానని ఆయన అన్నారు.
కాగా, ఆర్కేనగర్ ఉపఎన్నిక డిసెంబర్ 21న జరగనుంది. ఈ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే కూటమి తరఫున మధుసూదనన్ బరిలో నిలవగా, శశికళ వర్గం నుంచి దినకరన్, డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్ బరిలోకి దిగుతున్నారు. విశాల్ స్వతంత్రుడిగా బరిలో నిలుస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 24న వెల్లడిస్తారు.