shashi kapoor: బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు శ‌శిక‌పూర్ మృతి!

  • అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ క‌న్నుమూత‌
  • 1938 మార్చి 18న కోల్‌క‌తాలో జ‌న్మించిన‌ శ‌శిక‌పూర్
  • 1941 నుంచి ప్రారంభ‌మైన ఆయ‌న న‌ట ప్ర‌స్థానం

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు, ప్రఖ్యాత కపూర్ కుటుంబానికి చెందిన నిన్నటితరం హీరో శ‌శిక‌పూర్ (79) ఇక‌లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న, ముంబయ్ లోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ఈ రోజు క‌న్ను మూశారు. న‌టుడిగానే కాకుండా ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా ఆయ‌న రాణించారు. ఆయ‌న‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. 1938 మార్చి 18న కోల్‌క‌తాలో శ‌శిక‌పూర్ జ‌న్మించారు. ఈయన ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కపూర్ కి మూడవ సంతానం (ప్రముఖ నటులు రాజ్ కపూర్, షమ్మీ కపూర్ ఈయనకు సోదరులు).

1941 నుంచి ప్రారంభ‌మైన ఆయ‌న న‌ట ప్ర‌స్థానం 1999 వ‌ర‌కు కొన‌సాగింది. సంగ్రామ్ (1950), దనపాణి (1953) లాంటి వ్యాపారాత్మక చిత్రాల్లో బాల నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం సునీల్ దత్ నటించిన తొలి సినిమా 'పోస్ట్ బాక్స్ 999'కి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ని ప్రారంభించారు. తర్వాత హీరోగా 1961లో 'ధరం పుత్ర' సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు.  

కాలక్రమంలో అనేక హిట్ సినిమాల్లో న‌టించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. 70, 80 దశకాలలో పలు కమర్షియల్ హిట్స్ రావడంతో ఆయనకు స్టార్ డమ్ వచ్చింది. షర్మిలీ, కభీ కభీ, పిఘల్టా ఆస్మాన్ వంటి సూపర్ హిట్స్ లో ఆయన నటించాడు. ఆయన నటించిన చివరి చిత్రం సైడ్‌ స్ట్రీట్స్‌ (1999). తన కెరీర్లో మొత్తం 61 సినిమాల్లో ఆయ‌న పూర్తిస్థాయి హీరోగా న‌టించారు. 2010లో ఫిల్మ్‌ఫేర్ జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం, 2011లో ప‌ద్మ భూష‌ణ్ అవార్డు, 2015లో దాదాసాహెబ్ పాల్కే పుర‌స్కారం ల‌భించాయి.  

  • Loading...

More Telugu News