paytm: ఇక టోల్ గేట్ దగ్గర ఎదురుచూడాల్సిన అవసరం లేదు... అందుబాటులోకి పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్
- దేశవ్యాప్తంగా 380 టోల్‌గేట్లలో అమలు
- త్వరలో పూర్తి స్థాయి విస్తరణ
- డిసెంబర్ 1 నుంచి విడుదలయ్యే అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగింగ్
టోల్ గేట్ల దగ్గర డబ్బులు కట్టడానికి వాహనదారులు ఎదురు చూడాల్సి ఉంటుంది. దీని వల్ల విలువైన సమయం వృథా అవుతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కించడానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఓ కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. దీని పేరు 'పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్'. దీని ద్వారా టోల్ ఛార్జీలు ఆటోమేటిక్‌గా పేటీఎం నుంచి కట్ అవుతాయి. దీంతో అక్కడ ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.
రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) టెక్నాలజీ ద్వారా ఇది పనిచేస్తుంది. కారు అద్దం దగ్గర పేటీఎం వారి ఫాస్ట్‌ట్యాగ్‌ని అంటిస్తారు. టోల్ గేట్ దగ్గర ఉన్న స్కానర్ దీన్ని స్కాన్ చేసి, ఖాతా నుంచి డబ్బులు చెల్లిస్తుంది. దానికి సంబంధించిన ఇన్‌వాయిస్ మెయిల్ ద్వారా వస్తుంది. ప్రస్తుతం దేశంలోని 380 టోల్‌గేట్లలో ఈ సదుపాయాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. డిసెంబర్ 1 నుంచి మార్కెట్లో విడుదలయ్యే అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్‌లను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
ఇప్పటికే ఉన్న వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ కావాలంటే పేటీఎం యాప్ నుంచి కొనుక్కోవచ్చు. ఈ ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా టోల్ చెల్లించినవారికి 7.5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. ఈ సదుపాయ విస్తరణ కోసం మారుతి, హ్యుందాయ్, టాటా, మెర్సిడెస్, రెనాల్ట్, బీఎండబ్ల్యూ, వోక్స్‌వేగన్, వొల్వో వంటి కార్ల తయారీ కంపెనీలతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఒప్పందం చేసుకున్నట్లు కంపెనీ సీఈఓ, ఎండీ రేణు సత్తి తెలిపారు.