North Korea: అణు పరీక్షలతో రేడియేషన్ ప్రభావం.. అంతుచిక్కని వ్యాధితో ఉ.కొరియా ప్రజల్లో భయం!
- వరుసగా క్షిపణి, అణు పరీక్షలు
- అణు పరీక్షల వల్ల మరణిస్తోన్న ప్రజలు
- ఉ.కొరియా నుంచి పారిపోయి ద.కొరియాకు వచ్చిన 30 మంది సైనికులు
- పలు విషయాలను చెప్పిన రిపోర్టులు
క్షిపణి, అణు పరీక్షలు చేస్తూ కలకలం రేపుతోన్న ఉత్తరకొరియాలో రేడియేషన్ ప్రభావంతో పరిస్థితులు దారుణంగా మారినట్లు తెలుస్తోంది. ఆ ప్రభావంతో అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో, భయపడి ఆ దేశ సైనికులు ఇప్పటివరకు 30 మంది దక్షిణ కొరియాలోకి పారిపోయినట్లు అక్కడి మీడియా తెలిపింది. రేడియేషన్ కారణంగా ఆ సైనికులు చాలా బాధని అనుభవిస్తున్నట్లు దక్షిణ కొరియా వైద్యులు పేర్కొన్నారు.
ఉత్తరకొరియా నుంచి పారిపోయి వచ్చిన ఓ సైనికుడు మాట్లాడుతూ... అణు పరీక్షల వల్ల ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్యకు లెక్కేలేదని చెప్పాడు. రేడియేషన్ కారణంగా బాధపడే వారిని ‘ఘోస్ట్ డిసీజ్’ ( దెయ్యం వ్యాధి)తో బాధపడుతున్నట్లు ఉత్తరకొరియాలో చెబుతున్నారని, అంతేకాకుండా అవయవ లోపంతో జన్మించిన శిశువులను ఉత్తరకొరియాలో చంపేస్తారని భయంకర నిజాలు చెప్పాడు.
కాగా, రేడియేషన్ కారణంగానే ఉత్తరకొరియాలో మరణాలు సంభవిస్తున్నాయన్నడానికి తమకు ఇప్పటివరకు సరైన ఆధారాలు దొరకలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరోవైపు, అంతుచిక్కని వ్యాధితో ఉత్తరకొరియా ప్రజలు భయపడుతున్నారని పలు రిపోర్టులు చెబుతున్నాయి.