Australia: పార్లమెంట్ చర్చ మధ్యలో స్వలింగ భాగస్వామికి ప్రపోజ్ చేసిన ఆస్ట్రేలియన్ చట్టసభ్యుడు!
- స్వలింగ వివాహాల గుర్తింపు బిల్లుపై చర్చ
- త్వరలో చట్టబద్ధం కానున్న స్వలింగ వివాహాలు
- చట్టసభ్యుడి ప్రపోజల్‌ని అంగీకరించిన భాగస్వామి
ఆస్ట్రేలియా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తూ సభ్యులు అక్కడ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ బిల్లు చట్టరూపం కూడా దాల్చనుంది. అయితే ఈ బిల్లుపై చర్చిస్తూ చట్టసభ్యుడు టిమ్ విల్సన్, తన స్వలింగ భాగస్వామి, స్కూల్ టీచర్ అయిన రాయన్ బోల్జర్‌కి ప్రపోజ్ చేశారు. గ్యాలరీలో వుండి ఈ చర్చను వీక్షిస్తున్న బోల్జర్ వెంటనే 'ఎస్' అంటూ దానికి అంగీకారం తెలిపాడు.
గత ఏడేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కానీ అక్కడ స్వలింగ వివాహాలపై నిషేధం ఉండటం కారణంగా పెళ్లి చేసుకోలేక పోయారు. త్వరలో ఆ నిషేధం ఎత్తివేయనున్న నేపథ్యంలో టిమ్ ప్రపోజ్ చేశారు. అతను మాట్లాడుతున్నపుడు కొంత ఉద్వేగానికి గురయ్యాడు. కానీ బోల్జర్ అంగీకరించగానే ఆనందం వ్యక్తం చేశాడు. దీంతో అక్కడున్న ఇతర చట్టసభ్యులు చప్పట్లు కొట్టి, వారిద్దరినీ అభినందించారు.