turkey: సరస్సు అడుగున 3000 ఏళ్ల నాటి కోట.. వెలుగులోకి తెచ్చిన పరిశోధకులు!
- టర్కీలోని వాన్ సరస్సులో అద్భుతం
- ఉరాటు నాగరికతకు చెందినదిగా గుర్తింపు
- ఫొటోలు పోస్ట్ చేసిన డైవర్ తహసిన్ సీలాన్
టర్కీలోని వాన్ సరస్సులో 3000 ఏళ్ల నాటి కోటను అండర్‌వాటర్ పరిశోధకులు కనిపెట్టారు. ఇది 9 - 6వ శతాబ్దాల మధ్య కాలానికి చెంది ఉంటుందని, ఉరాటు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అక్కడి వాన్ యూజించు యూనివర్సిటీ అధ్యాపకులు తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించిన ఫొటోలను డైవర్ తహసిన్ సీలాన్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు.
'సరస్సు అడుగున ఏదో ఉందని చాలా కాలం నుంచి పుకారు ఉంది. కానీ ఎవ్వరికీ ఏం కనిపించలేదు. కానీ గట్టి ప్రయత్నం చేయడంతో మాకు కనిపించింది' అని తహసిన్ సీలాన్ చెప్పారు. శతాబ్దాల తరబడి జలసమాధిలో ఉన్నప్పటికీ కోట గోడలు చెక్కు చెదరలేదని తహసిన్ పేర్కొన్నారు. వాన్ సరస్సు చుట్టుపక్కల ఎన్నో నాగరికతలు వెలిశాయని, సరస్సు అడుగున ఇంకా మరెన్నో మిస్టరీలు ఉండొచ్చని ఆయన అన్నారు.