orvil rogers: వందో పుట్టినరోజు సందర్భంగా వంద మైళ్లు పరిగెత్తిన అమెరికన్!
- డల్లాస్‌లో నివాసముండే ఓర్వీల్ రోజర్స్
- నాలుగు తరాల కుటుంబ సభ్యులతో కలిసి పరుగు
- రోజర్స్‌కి ఆదర్శంగా నిలిచిన `ఎరోబిక్స్` పుస్తకం
ఈ రోజుల్లో వందేళ్ల వరకు జీవించడమే ఓ అద్భుతం... కానీ అమెరికాలోని డల్లాస్ ప్రాంతానికి చెందిన ఓర్వీల్ రోజర్స్ మాత్రం వందో పుట్టినరోజు జరుపుకోవడమే కాదు... వందేళ్ల వయసులోనూ 100 మైళ్ల దూరం పరిగెత్తారు. ఈ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవడం కోసం తన నాలుగు తరాల కుటుంబ సభ్యులను పిలిపించి వారితో కలిసి పరిగెత్తి ఆనందంగా వేడుక చేసుకున్నారు.
50 ఏళ్లు నిండే వరకు రోజర్స్‌కి పరుగంటే ఏంటో తెలియదు. కానీ ఎప్పుడైతే 'ఎరోబిక్స్' అనే పుస్తకం చదివాడో అప్పటి నుంచి పరుగు ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. రోజూ పరిగెత్తడం వల్ల కలిగే లాభాలు, మెరుగైన జీవన శైలి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలన్నింటినీ ఆ పుస్తకం ద్వారా రోజర్స్ నేర్చుకున్నారు.
ఇక అప్పుడు మొదలుపెట్టిన పరుగు ఇప్పటికీ ఆపలేదు. మారథాన్‌లు, పోటీల్లో పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. 72 ఏళ్ల వయసులోనే ఆయన వారానికి 80 మైళ్లు పరుగులు తీసేవారు. వయసుతో పాటే ఈ మధ్య తన పరుగు తీసే సామర్థ్యం కూడా తగ్గుతోందని, అందుకే 100వ పుట్టినరోజుకి వంద మైళ్లు పరుగుతీయాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. తన కుటుంబ సభ్యుల సాయంతో ఆ పని పూర్తిచేయగలిగినట్లు చెప్పారు. రోజర్స్ గతంలో పైలట్ గానూ శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం రోజర్స్ తన జూనియర్లకు శిక్షణ ఇస్తున్నారు.