kadapa: కడప పోలీసులు సూపర్... అధునాతన టెక్నాలజీతో మూడంటే మూడు నిమిషాల్లో దొంగ పట్టివేత!
- అధునాతన టెక్నాలజీతో అందివచ్చిన ఎల్ హెచ్ఎంఎస్
- యాప్ లోడ్ చేసుకుంటే, ఇంటికి పోలీసుల కాపలా
- కడపలో తాళం పెట్టిన ఇంట్లోకి జొరబడిన దొంగ
- వెంటనే వచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు
కడప ఖాకీలు అద్భుతాన్ని చూపించారు. పోలీసు శాఖలో 'రియల్ టైమ్ గవర్నెన్స్'ను అమలు చేయడం ప్రారంభించిన తరువాత తొలి ఫలితాన్ని చూపారు. తాళం వేసివున్న ఓ ఇంట్లోకి దొంగ ప్రవేశించగా, మూడంటే మూడు నిమిషాల్లో అక్కడికి చేరుకుని దొంగను అరెస్ట్ చేసి వహ్వా అనిపించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, "ఎవరైనా ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తే 'ఎల్ హెచ్ఎంఎస్' అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేయండి. మేము మీ ఇంటిని కాపలా కాస్తాం" ఇది కడప పోలీసుల వినూత్న ప్రచారం.
వారు చెప్పినట్టుగా యాప్ లో వివరాలు నమోదు చేసుకుంటే, పోలీసులు ఇంటికి వచ్చి ఓ ప్రత్యేక పరికరాన్ని ఏర్పాటు చేసి వెళతారు. ఆపై ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా వెంటనే కంట్రోల్ రూములో అలారం మోగుతుంది. ఈ అధునాతన టెక్నాలజీ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసే స్థాయి నుంచి, అసలు నేరమే జరుగకుండా చూసే స్థాయికి చేర్చింది.
ఇక తాజా విజయానికి వస్తే, నవంబర్ 14న కడప, చిన్న చౌక్ ప్రాంతానికి చెందిన మహేష్ ఊరెళుతూ, డిసెంబర్ 8 వరకూ తాను ఉండనని, ఎల్ హెచ్ఎంఎస్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆ తర్వాత ఇంటికి తాళం ఉన్న విషయాన్ని గమనించిన ఓ చోరుడు, రాత్రి 2.10 గంటల సమయంలో ఇంట్లోకి దూరాడు. వెంటనే విషయం పోలీసులకు తెలిసిపోయింది. సైరన్ మోగగా, మూడు నిమిషాల్లో అక్కడికి వచ్చేసిన పోలీసులు, ఇంట్లో ఉన్న దొంగను అరెస్ట్ చేశారు. ఇప్పుడు కడప పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.