Prithivi shaw: అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టును నడిపించనున్న ముంబై బ్యాటింగ్ సెన్సేషన్!
- రంజీల్లో అదరగొట్టిన పృథ్వీ షా
- ఐదు రంజీల్లో మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు
- ఇప్పటికే మూడు అండర్-19 ప్రపంచకప్‌లు కైవసం చేసుకున్న భారత్
వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు న్యూజిలాండ్‌లో జరగనున్న అండర్-19 ప్రపంచకప్‌లో పాల్గొననున్న భారత జట్టుకు ముంబై బ్యాటింగ్ సెన్సేషన్ పృథ్వీ షా సారథ్యం వహించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. ప్రపంచకప్‌లో ఆడనున్న 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ పృథ్వీషాను కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి పేర్కొన్నారు.
ఈ ఏడాది రంజీ సీజన్‌లో పృథ్వీ షా అద్భుత ఆటతీరుతో అదరగొట్టాడు. ఐదు ట్రోఫీల్లో మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. పంజాబ్ ఆల్ రౌండర్ శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
గత ప్రపంచకప్‌లో రన్నరప్ అయిన భారత జట్టు 2000, 2008, 20012లో మూడుసార్లు వరల్డ్‌కప్‌ను ఎగరేసుకొచ్చింది. గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన ఫైనల్స్‌లో విండీస్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు ఈ నెల 8-22 మధ్య బెంగళూరులో నిర్వహించనున్న శిక్షణ శిబిరంలో పాల్గొంటుందని అమితాబ్ చౌదరి తెలిపారు.
అండర్-19 జట్టు ఇదే: పృథ్వీ షా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), మన్‌జోత్ కల్రా, హిమాంశు రానా, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, అర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), హర్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), శివం మావి, కమలేష్ నాగర్‌కోట్, ఇషాన్ పరోల్, అర్షదీప్ సింగ్, అనుకుల్ రాయ్, శివ సింగ్, పంకజ్ యాదవ్