Posani Krishna Murali: సినిమావాళ్లే ఎందుకు? మీడియాలో ఎవరూ తాగరా?: పోసాని కృష్ణమురళి
- ఇల్లు ప్రశాంతంగా క్రమశిక్షణతో ఉంటే పిల్లలకు ఎలాంటి చెడు అలవాట్లు రావు
- ఇంట్లో క్రమ శిక్షణ లేకపోతే చెడు అలవాట్ల బారిన పడతారు
- చెడు అలవాట్ల వల్ల మనమే నాశనమైపోతాం
తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బోర్డు, తెలంగాణ అమెరికా అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన డ్రగ్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ ఫ్రీ హైదరాబాదు మారథాన్ 5కె రన్ లో ప్రముఖ సినీనటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రమశిక్షణగా ఉంటే పిల్లలు చెడు అలవాట్లకు బానిసలు కారని చెప్పారు.
ఇల్లు ప్రశాంతంగా, క్రమశిక్షణగా, ప్రేమగా ఉంటే పిల్లలు ఆనందంగా ఉండడంతో పాటు, ఏ చెడు అలవాట్ల బారిన పడరని అన్నారు. అలా కాకుండా పొద్దున్న లేవగానే తల్లిదండ్రులు పోట్లాడుకోవడం, పిన్ని బాబాయి తిట్టుకోవడం, టీవీలో డ్రగ్స్ చూపించడం వంటివి చేస్తే పిల్లల్లో మంచి లక్షణాలు రావని అన్నారు. పిల్లల్లో మంచి లక్షణాలు పెరగాలంటే ఇంట్లో పరిస్థితులు బాగుండాలని ఆయన చెప్పారు. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదని, పరిస్థితులను ప్రశాంతంగా ఉంచితే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో మద్యం, డ్రగ్స్ వాడకంపై స్పందన ఏంటి? అని ఆయనను ఒక పాత్రికేయుడు అడుగగా... తనదైన శైలిలో స్పందిస్తూ... 'ఒక్క సినీ పరిశ్రమలోనే ఏంటి? మీ మీడియాలో లేవా? మీడియాలో మద్యం తాగరా?' అని ఎదురు ప్రశ్నించారు. డ్రగ్స్, మద్యం వంటివి కేవలం ఒక సినీ పరిశ్రమకో లేక మీడియాకో పరిమితం కాదని, అన్ని రంగాల్లోనూ ఉంటాయని, వాటికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.