Virat Kohli: కెప్టెన్ గా మరెవరికీ సాధ్యం కాని రికార్డును సృష్టించిన విరాట్ కోహ్లీ!
- మరెవరికీ సాధ్యంకాని రికార్డు కోహ్లీ సొంతం
- కెప్టెన్ గా అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఘనత
- ఓవరాల్ గా ఆరో స్థానంలో కోహ్లీ
భారత క్రికెట్ కెప్టెన్ మరెవరికీ సాధ్యంకాని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో, రెండో టెస్టులోనే, కెప్టెన్ గా అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన బ్రియన్ లారా రికార్డును సమం చేసిన ఆయన, మూడో టెస్టులో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఓ కెప్టెన్ గా ఆరు డబుల్ సెంచరీలను టెస్టు క్రికెట్ లో సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. న్యూఢిల్లీలో జరుగుతున్న మ్యాచ్ రెండో రోజు కోహ్లీ ఈ రికార్డును నమోదు చేశాడు.
ఇక టెస్టు క్రికెట్ లో భారత్ తరఫున ఆరేసి డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్లుగా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లు ఉండగా, కోహ్లీ ఇప్పుడు వారితో సమానంగా నిలిచాడు. ఇక కోహ్లీకి అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాడి హోదా దక్కేందుకు ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఇక టెస్టుల్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించిన వినోద్ కాంబ్లీ రికార్డునూ కోహ్లీ సమం చేశాడు. మొత్తం మీద ప్రస్తుతం విరాట్ కోహ్లీ అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. కోహ్లీకన్నా ముందు బ్రాడ్ మన్ 12, సంగక్కార 11, లారా 9, వాలీ హమ్మోండ్ 9, జయవర్ధనే 7 సెంచరీలతో ఉన్నారు.