kapu reservations: ఆర్.కృష్ణయ్య విమర్శలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన నేతలు... స్పందనిది!
- కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ తీర్మానం
- తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య
- కృష్ణయ్య వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు
2014 ఎన్నికల్లో తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగి, ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య, సీటిచ్చి గౌరవించిన పార్టీనే విమర్శించడం ఎంతమాత్రమూ సమంజసంగా లేదని, ఆయన వైఖరి దురదృష్టకరమని పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. నిన్న ఏపీ అసెంబ్లీలో కాపులను బీసీల్లో చేరుస్తూ, 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, తీర్మానాన్ని ఆమోదించిన తరువాత, ఆర్ కృష్ణయ్య మండిపడిన సంగతి తెలిసిందే.
బడుగులకు అన్యాయం జరుగకుండా, బీసీలకు రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇక ఈ ఉదయం కృష్ణయ్య వ్యాఖ్యలను కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లగా, తెలంగాణలో కొన్ని కులాలను బీసీల జాబితా నుంచి తొలగించినప్పుడు కృష్ణయ్య ఎందుకు మాట్లాడలేదని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. నిబంధనల మేరకే కాపు రిజర్వేషన్ బిల్లును పెట్టామని, ఈ విషయంలో వెనకడుగు వేయబోమని, ఎవరికైనా సందేహాలుంటే తీర్చుకోవచ్చని చంద్రబాబు చెప్పినట్టు పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి.