Savithri: నీ వీణ సరస్వతి అయితే, నా రుబ్బురోలు అన్నపూర్ణ కాదా?: ఆనాడు సావిత్రికి షాకిచ్చిన సూర్యకాంతం!
- ఆనాటి సరదా ఘటన
- విమానంలో ప్యాసింజర్ గా సావిత్రి వీణ
- విషయం తెలిసి తాను రుబ్బురోలు తెచ్చుకునే దాన్నన్న సూర్యకాంతం
- సావిత్రికి కోపం వస్తే తన మాటలతో చల్లార్చిన సూర్యకాంతం
తెలుగు సినీ చరిత్రలో ఎవరూ మరచిపోలేని నటీమణులు సావిత్రి, సూర్యకాంతంల మధ్య జరిగిన ఓ సరదా ఘటన ఇది. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాస్ కేంద్రంగా ఉండి, అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలు హైదరాబాద్ లో నిర్మితమవుతున్న రోజులవి. ఓ విమానం మద్రాస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన వేళ, విమాన సిబ్బంది ప్రయాణికులను లెక్కించగా, ఒకరు తక్కువగా ఉన్నట్టు వస్తోందట. కంగారు పడ్డ సిబ్బంది మరోసారి లెక్కించగా, వారికి అసలు విషయం తెలిసింది.
సావిత్రి ఆ సమయంలో వీణ నేర్చుకుంటూ, తనతో పాటు ఓ బొబ్బిలి వీణను తెచ్చి, దాన్ని లగేజీగా కాకుండా, సీటు కొనుక్కొని మరీ, పక్క సీటులో పెట్టుకున్నారట. ఆమె వెనుకే కూర్చుని ఉన్న సూర్యకాంతానికి ఈ విషయం తెలియగా, విమానంలో ఇలా సామాన్లకు కూడా అనుమతి ఇస్తారని తెలిస్తే, తనతో పాటు తన రోలు, దోసెల పెనం కూడా తెచ్చుకునేదాన్నిగా? అన్నారట.
ఈ మాటలకు సావిత్రికి కోపం రాగా, "అత్తమ్మా, నా వీణకు, నీ రుబ్బురోలుకూ పోలికా? మాటలు తిన్నగా రానీ" అని చిరు కోపాన్ని ప్రదర్శించగా, ఆమెను చల్లార్చేందుకు, "నా మాటల్లో తప్పేముంది కోడలా? నీ వీణ సరస్వతి అయితే, నా రుబ్బురోలు అన్నపూర్ణ కాదా?" అని అక్కడి వాతావరణాన్ని, సావిత్రి ఆగ్రహాన్ని చల్లార్చారట.