Okchi: ‘ఓఖీ’ విలయం.. లక్షద్వీప్ కకావికలు.. కొనసాగుతున్న హెచ్చరికలు
- నేల కొరిగిన ఇళ్లు, చెట్లు, కుప్పకూలిన సమాచార వ్యవస్థ
- గల్లంతైన వారి కోసం రంగంలోకి దిగిన యుద్ధ నౌకలు
- మృతులకు రూ.లక్ష పరిహారం ప్రకటించిన కేరళ సీఎం
లక్షద్వీప్‌పై ఓఖీ తుపాను పెను ప్రభావం చూపిస్తోంది. భారీ వర్షాలకు బలమైన గాలులు తోడవడంతో పెను విధ్వంసమే జరిగింది. ఇళ్లు, చెట్లు నేలకొరిగాయి. సమాచార వ్యవస్థ కుప్పకూలింది. సముద్ర మట్టం ఒక్కసారిగా పెరిగింది. వచ్చే 24 గంటల్లో తుపాను మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ నిరీక్షక్, ఐఎన్ఎస్ జమున, ఐఎన్ఎస్ సాగర్ ధ్వని నౌకలు గాలింపు, సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. అలాగే ఐఎన్ఎస్ శార్దూల్, ఐఎన్ఎస్ శారదను కూడా తరలించారు. ఇప్పటి వరకు 531 మంది జాలర్లను రక్షించినట్టు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కన్యాకుమారి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన వెయ్యిమంది జాలర్ల ఆచూకీ గల్లంతైంది. తుపాను ప్రభావం ఈ జిల్లాపై ఎక్కువగా పడింది. విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ లేక నాలుగు రోజులుగా ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. తుపాను కారణంగా శ్రీలంకలో 13 మంది మృత్యువాత పడ్డారు.