Chandrababu: ఐటీ మంత్రి లోకేశ్ కు, నాకు మధ్య ఉన్న డిఫరెన్స్ ఇది!: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- ఇకపై వరుసగా హ్యాకథాన్
- వేరే ప్రాంతాలకు వెళ్లే వారిని వెనక్కు రమ్మంటున్న లోకేశ్
- ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ వెళ్లాలన్నది నా అభిమతం
- ప్రపంచాన్ని జయించే స్థితికి ఏపీ యువత చేరాలన్న చంద్రబాబు
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య విభాగంపై జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతున్న వేళ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై వరుసగా హ్యాకథాన్ లు నిర్వహిస్తామని చెప్పిన ఆయన, తన కుమారుడు, ఐటీ మంత్రి లోకేశ్ కు, తనకు మధ్య ఓ డిఫరెన్స్ ఉందని చెప్పారు.
"ఒక అడుగు ముందుకేస్తే... అదే నాంది అవుతుంది వంద అడుగులు వేయడానికి. అయితే, ఐటీ మినిస్టర్ ఓ మాట అన్నాడు. ఆయనకు, నాకు ఒక డిఫరెన్స్ ఉందిక్కడ. ఆయనేమన్నాడంటే... మీరంతా వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మీరంతా ఇక్కడికి రావాలన్నాడు. నా ఆలోచన ఏమిటంటే, మీరు ప్రపంచమంతా వెళ్లాలి. ఎక్కడ చూసినా తెలుగు వాళ్లే ఉండాలి. ప్రపంచాన్ని జయించే పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఉంది" అని చెప్పారు.
తాను రియల్ టైమ్ గవర్నెన్స్ ను ప్రారంభించిన తరువాత పాలనలో పారదర్శకత పెరిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీ ఆధారంగా అభివృద్ధిని చేస్తామని వెల్లడించారు. 2029 నాటికి ఇండియాలో నంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను నిలుపుతామని తెలిపారు.