Cricket: తొలిరోజు ముగిసిన ఆట... టీమిండియా 371/4
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- 150కి పైగా వ్యక్తిగత పరుగులు చేసిన మురళీ విజయ్, విరాట్ కోహ్లీ
- భారీ స్కోరు దిశగా టీమిండియా
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా శ్రీలంక జట్టుతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు తొలి సెషన్ లో శిఖర్ ధావన్ (23), ఛటేశ్వర్ పుజారా (23) ల వికెట్లు కోల్పోయింది. అనంతరం అప్పటికే నిలదొక్కుకున్న ఓపెనర్ మురళీ విజయ్ (155) కి కెప్టెన్ విరాట్ కోహ్లీ (156) జతకలిశాడు.
వీరిద్దరూ ఆడుతూ పాడుతూ చెరొక 150 పరుగులు చేశారు. దీంతో మూడో వికెట్ కు 283 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. మురళీ విజయ్ ని స్టంప్ అవుట్ గా డిక్ వెల్లా పెవిలియన్ కు పంపగా, తరువాతి బంతికే అదే రీతిలో రహానే (0) అవుటయ్యాడు. అనంతరం కోహ్లీకి రోహిత్ శర్మ (6) జతకలిశాడు. దీంతో తొలిరోజు ఆటలో టీమిండియా 90 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో చందక రెండు వికెట్లతో రాణించగా, పెరీరా, గమగే చెరొక వికెట్ తీసి ఫర్వాలేదనిపించారు.