lamis veera grantham: లక్ష్మీస్ వీరగ్రంథం, శశిలలిత సినిమాలను తీసి తీరుతాను.. ఏ శక్తీ నన్ను అడ్డుకోలేదు: కేతిరెడ్డి ప్రకటన
- లక్ష్మీపార్వతి నన్ను ఆపలేరు
- మన్నార్‌గుడి మాఫియా నన్ను అడ్డుకోలేదు
- ఎన్నో అభ్యంతరాలు చెబుతున్నారు
- అనేక మంది గొప్పవారి జీవితాలు ఎన్టీఆర్ లాగే ఉన్నాయి
'లక్ష్మీస్ వీరగ్రంథం' పేరుతో తాను సినిమా తీస్తున్నట్టు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆ సినిమా విషయంలో లక్ష్మీపార్వతి అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి తాను ఆ సినిమాయే కాకుండా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత, శశికళ జీవితంపై 'శశిలలిత' అనే సినిమా తీస్తానని, తనను ఎవ్వరూ అడ్డుకోలేరని ఆయన తాజాగా తెలిపారు.
"నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంధం' దర్శకుడిని. మేము ఈ సినిమాను మొదలుపెట్టినప్పటి నుంచి లక్ష్మీపార్వతి గారు ఎన్నో రకాల వివాదాలను రేపుతున్నారు. మేము చెబుతున్నది ఏంటంటే.. భారత్‌లో ఉన్న ఎంతో మంది గొప్ప నాయకుల జీవిత చరిత్రలను తీశారు. లక్ష్మీ పార్వతి జీవితం కూడా గొప్ప నాయకుడితో ముడిపడి ఉంది. లక్ష్మీపార్వతి గారిని నేను కోరేదేంటంటే.. మీ కథ అని మీకు అనుమానం ఉంది కాబట్టి, మీ జీవితంలో జరిగిన సంఘటనలను ఓ పేపరు మీద పెట్టుకుని, కాపీ రైట్ కింద రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ నేను తీస్తోన్న ఈ సినిమాలో మీ కథలోని సన్నివేశాలు ఉంటే మీకు అడిగే హక్కు ఉంటుంది.
భారత్‌లో చాలా మంది గొప్పవారి జీవితం అన్నగారి(ఎన్టీఆర్) లాంటి జీవితంలాగే ఉంటుంది. తమిళనాడులో కూడా జయలలిత జీవితంలోకి శశికళ ప్రవేశించింది. ఇక్కడ ఈ కథ అక్కడ ఆ కథ ఒకేలా ఉన్నాయి. మీరు అన్నగారి సేవలకురాలిలా ప్రవేశించి ఎలా ఆయన జీవిత భాగస్వామి అయ్యారో, అలాగే, తమిళనాడులో జయలలిత జీవితంలోకి ప్రవేశించి శశికళ కూడా ఒక సేవకురాలిగా ప్రవేశించారు. ఇద్దరి జీవితాలూ ఒకేలా ఉన్నాయి.
జయలలిత జీవితంలో శశికళ ప్రవేశం కథ ఆధారంగా 'శశిలలిత' తీస్తున్నాను. ఇటువంటి శశికళ, లక్ష్మీపార్వతి లాంటి వారి జీవితాలు ప్రజలకు తెలియాలి. 'శశిలలిత' సినిమా స్క్రిప్టు వర్కు జరుగుతోంది. రామారావు జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించి ఓ రాజ్యాంగేతర శక్తిలాగా ఉన్నారు. లక్ష్మీపార్వతి అభ్యంతరాలు చెబుతున్నారు. అనేక మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి కాబట్టి నా సినిమాపై అభ్యంతరాలు చెప్పకూడదు.
అలాగే శశికళ వర్గీయులు కూడా నాపై దాడి చేస్తారని నేను భయపడను. మన్నార్‌గుడి మాఫియా నన్ను అడ్డుకోలేదు. నా వెనుక తెలుగు యువశక్తి ఉంది. నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. జయలలిత మరణంపై విచారణ జరపాలని నేను కోర్టులో కేసు వేస్తే తమిళ ప్రజలు మెచ్చుకున్నారు. ఓ సంచలనానికి నాంది పలుకుతా" అని కేతిరెడ్డి చెప్పారు.