infosys: ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీగా సలీల్ ఎస్. పరేఖ్
- జనవరి 2, 2018న బాధ్యతలు
- ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం
- సీఓఓగా కొనసాగనున్న యూబీ ప్రవీణ్ రావ్
కాప్ జెమినీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సలీల్ ఎస్. పరేఖ్‌ను సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంచుకున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. జనవరి 2, 2018 నుంచి ఆయన సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపింది. రెండు నెలలుగా కొత్త సీఈఓ కోసం ఇన్ఫోసిస్ వెతుకుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఈఓ, ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న యూబీ ప్రవీణ్ రావ్ జనవరి 2 నుంచి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా కొనసాగనున్నారు.
సలీల్ ఎస్. పరేఖ్ ఐఐటీ బాంబే నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. కొర్నెల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌ల్లో మాస్టర్స్ పుచ్చుకున్నారు. అంతర్జాతీయంగా ఐటీ రంగంలో ముప్పై ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సలీల్, ఇన్ఫోసిస్‌లో చేరబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని కంపెనీ బోర్డు చైర్మన్ నందన్ నీలేకని అన్నారు. విశాల్ సిక్కా రాజీనామా తర్వాత సీఈఓ స్థానం అధికారికంగా ఖాళీ అయిన సంగతి తెలిసిందే.