white house: బొద్దింకలు, ఎలుకలు, చీమలకు నిలయమైన శ్వేతసౌధం... బయటపెట్టిన వర్కింగ్ ఆర్డర్ డాక్యుమెంట్లు
- మరమ్మతుల కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు
- అయినప్పటికీ పట్టించుకోని జీఎస్ఏ
- వైట్‌హౌస్ మరమ్మతుకి సంవత్సరానికి లక్ష డాలర్ల ఖర్చు
అమెరికా అధ్యక్షుడి భవనం వేల సంఖ్యలో బొద్దింకలు, ఎలుకలు, చీమలకు నిలయమైనట్లు తెలుస్తోంది. ఇటీవల బయటపడిన 2017 వర్కింగ్ ఆర్డర్ల డాక్యుమెంట్ల ద్వారా ఈ విషయం తెలిసింది. అధ్యక్షుడి అధికారిక నివాసంలోని దాదాపు నాలుగు చోట్ల, చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాన్ కెల్లీ కార్యాలయంలో చీమల బెడద ఉన్నట్లు తెలిసింది. అలాగే సిట్చువేషన్ గదిలో, నావీ మెస్‌లో ఎలుకలు ఉన్నట్లు డాక్యుమెంట్లలో ఉంది.
వీటితో పాటు శ్వేతసౌధంలోని మిగతా గదుల నిర్వహణ, మరమ్మతు కోసం అధికారులు యూఎస్ జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్ఏ)కి వందల సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ పట్టించుకోనట్లుగా తెలుస్తోంది. ఆన్‌లైన్ ద్వారా జీఎస్ఏకు పంపే ఈ ఆర్డర్ డాక్యుమెంట్లలో జాతీయ రక్షణ సలహాదారు హెచ్. ఆర్. మెక్‌స్టర్ గది మరమ్మతు, ఓవల్ ఆఫీస్‌లో కొత్త టాయ్‌లెట్ బేసిన్, మాజీ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ షాన్ స్పైసర్ గదిలో కొత్త ఫర్నీచర్ కోసం పెట్టుకున్న దరఖాస్తులు ఉన్నాయి.
వాషింగ్టన్ డీసీలో ఉన్న 9000లకి పైగా ప్రభుత్వ భవనాల నిర్వహణను జీఎస్ఏ పర్యవేక్షిస్తుంది. ఏజెన్సీ రికార్డుల ప్రకారం వైట్‌హౌస్ మరమ్మతులు, నిర్వహణ కోసం జీఎస్ఏ సంవత్సరానికి లక్ష డాలర్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.