Virat Kohli: 'కోహ్లీ! వారికి.. మీరేం చెబుతారు?' అని అడిగిన మిస్ వరల్డ్ మానుషి చిల్లర్
- అవార్డుల కార్యక్రమంలో కోహ్లీని ప్రశ్నించిన మిస్ వరల్డ్
- చక్కని సమాధానం చెప్పిన కోహ్లీ
- మీరు మీరుగా ఉండండి, నిజాయతీగా ఆడండి అంటూ చెప్పిన టీమిండియా కెప్టెన్
అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన విజయాలతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు క్రికెట్ లో ఎవరిని అడిగినా బ్రాడ్ మన్, వివ్ రిచర్డ్స్, గవాస్కర్, కపిల్, వంటివారిని స్ఫూర్తిగా పేర్కొనేవారు. ఆ తరువాతి తరాన్ని సచిన్ శాసించాడు. ఆ తరువాత ఆ స్థాయిలో క్రికెట్ ను శ్వాసిస్తున్న వారు చెబుతున్న పేరు కోహ్లీది కావడం విశేషం. అలాగే సుదీర్ఘ విరామం తరువాత అందాల ప్రపంచంలో భారతీయ జెండాను ఎగురవేసిన ఘనత మానుషి చిల్లర్ ది. తాజాగా జరిగిన ఒక అవార్డుల ఫంక్షన్ లో ఈ ఇద్దరూ కలిసిన సన్నివేశం ఒకటి చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా కోహ్లీని మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ప్రశ్నిస్తూ, ‘‘ఇవాళ మీరు ప్రపంచంలోనే ఉత్తమ బ్యాట్స్ మన్. పిల్లలకు, ప్రత్యేకించి క్రికెట్ ప్రపంచంలో ఉన్నవారికి మీరిచ్చే సందేశం ఏమిటి?’’ అంది. దానికి కోహ్లీ సమాధానమిస్తూ, ‘‘మైదానంలో మీరు ఎప్పుడు ఏమి చేసినా మీ ఆట మీరు ఆడండి. యథార్థంగా, మనస్పూర్తిగా ఆటను ఆడండి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని నటిస్తున్నట్టుగా అనుమానిస్తారు.
ఒక్కసారి వాళ్లకు అలాంటి సందేహం వస్తే వారెప్పటికీ మిమ్మల్ని కనెక్ట్ కాలేరు. ఇక నా విషయానికి వస్తే... మైదానంలో నేనెప్పుడూ నేనుగానే ఉన్నాను. నేనెలా ఉన్నాను? ఎలా ఆడుతున్నాను? అని చాలా మంది సతమతమవుతుంటారు. కానీ నేనెప్పుడూ అలా సతమతం కాలేదు. నేనెలా ఆడగలనో అలాగే ఆడాను.. ఆడుతున్నాను.’’ అంటూ సమాధానం చెప్పాడు.