Thief: ఉన్నత చదువులు చదివాడు... కూతురి పెళ్లి కోసం 9 రాష్ట్రాల్లో 66 దొంగతనాలు చేశాడు!
- ఎదుటి వ్యక్తితో మాట్లాతూనే వ్యక్తిత్వం పసిగట్టే శైలేంద్ర
- ఎలా తప్పించుకోవాలో ఇంటర్నెట్ లో సెర్చ్
- మధ్యప్రదేశ్ లో పట్టుబడ్డ ఘరానా దొంగ
- హైదరాబాద్ కు తెచ్చిన పోలీసులు
ఉన్నత చదువులు చదివిన ఓ వ్యక్తి, కూతురి పెళ్లి కోసం పెడదారి పట్టాడు. అది కూడా మామూలుగా కాదు... 9 రాష్ట్రాల్లో దొంగతనాలు చేశాడు. ఇతనిపై 66 కేసులు ఉన్నాయి. ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూనే వ్యక్తిత్వం పసిగట్టి మోసం చేయడంలో దిట్ట. హైదరాబాద్ పరిధిలోనే 18 దొంగతనం కేసులు ఇతనిపై ఉన్నాయి.
మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి నుంచి డబ్బు లాక్కున్న కేసులో పోలీసులకు చిక్కగా, విచారణ నిమిత్తం హైదరాబాద్ కు నిందితుడిని తీసుకు వచ్చిన పోలీసులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బీకాం చదివిన శైలేంద్ర విశ్వకర్మ, దొంగతనాలు చేసి ఎలా తప్పించుకోవాలన్న అంశాలపై నిత్యమూ ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తూ కొత్త పద్ధతులు పాటిస్తుంటాడు.
పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడంలోనూ దిట్టే. బంధువులు, భార్య దగ్గరుంటే దొరికిపోతానని భావించి, వారిని కూడా తిప్పుతుంటాడు. వరుస దొంగతనాలు చేసి, తనకు దొరికిన ఆభరణాలను కుమార్తె పెళ్లి కోసం దాచి వుంచాడు. ఇక శైలేంద్రను విచారిస్తున్నామని, ఆయన ఇంట్లో దాచుకున్న 220 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇది మన్నెగూడలోని సామ భీమ్ రెడ్డి ఇంటి నుంచి దొంగతనం చేసిందని గుర్తించామని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.