Karanam Balaram: టీడీపీ నేతలు కరణం బలరాం, గొట్టిపాటి బాహాబాహీ.. కుర్చీ పట్టుకుని రవికుమార్‌వైపు దూసుకొచ్చిన కరణం!
- ప్రకాశం జిల్లా సమన్వయ సమావేశం రసాభాస
- కొట్టుకునేంత పనిచేసిన రవికుమార్, కరణం
- సర్దిచెప్పి శాంతింపజేసిన మంత్రి నారాయణ
ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్‌లు మరోమారు రెచ్చిపోయారు. సచివాలయం సాక్షిగా బాహాబాహీకి దిగారు. గురువారం సాయంత్రం జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు చాంబర్‌లో ప్రకాశం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. బాపట్ల పార్లమెంటు ఇన్‌చార్జి, మంత్రి పరిటాల సునీత, జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
సమావేశం ప్రారంభం అయిన తర్వాత అజెండాలోని అంశాలను చదువుతున్నప్పుడు వివాదం ప్రారంభమైంది. మార్కెట్ కమిటీల నియామకం గురించి సమావేశంలో ప్రస్తావించగానే మార్టూరు కమిటీ వ్యవహారాన్ని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లేవనెత్తారు. ఈ కమిటీ అధ్యక్షుడిని నియమించుకునే అవకాశం తనకు ఇవ్వాలని కోరారు. దీంతో జోక్యం చేసుకున్న కరణం బలరాం ఎక్కడి నుంచో వచ్చినవారు పెత్తనం చలాయించాలని చూస్తున్నారని, ఆ కమిటీని మీరే వేసుకోండంటూ గొట్టిపాటి రవికుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కరణం వ్యాఖ్యలకు స్పందించిన గొట్టిపాటి.. మార్టూరు ఏఎంసీ పాలకవర్గ నియామకం ఆగిపోవడంలో తన పాత్ర లేదని, అనవసరంగా తనను ఇరికించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కరణం బలరాం కుర్చీ ఎత్తి రవికుమార్ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ‘రా చూసుకుందాం’ అంటూ రవికుమార్ కూడా ముందుకెళ్లారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన నేతలు ఇద్దరికీ సర్దిచెప్పి నిలువరించారు. విషయం తెలిసిన మంత్రి నారాయణ సమావేశ మందిరానికి వచ్చి ఇరు నేతలను శాంతింపజేసి సమావేశాన్ని కొనసాగించారు.