Tamilnadu: తండ్రి వృత్తిని వారసత్వంగా స్వీకరించిన కొడుకు, కుమార్తె.. మొత్తం 61 కేసులు!
- రెండు రోజుల క్రితం తూత్తుకుడి ఆలయంలో బంగారం చోరీ
- 16 ఫిర్యాదులతో కేసులు నమోదు
- సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు, దొంగల గుర్తింపు
తండ్రి వృత్తిని వారసత్వంగా స్వీకరించే సంప్రదాయం కొన్ని వర్గాలలో తరతరాలుగా భారత్ లో కొనసాగుతోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటిదే. అయితే, వృత్తి మాత్రం భిన్నమైనది. చోరకళను వారసత్వంగా స్వీకరించిన కుటుంబం గురించిన కథ ఇది. చెన్నైలోని నీలాంగరై ఈచ్చం బాక్కం బెత్తేల్ ప్రాంతానికి చెందిన సుబ్రమణి (65) ఓ దొంగ. అతని వృత్తిని కుమారుడు (25), కుమార్తె (29) కూడా అనుసరించడం విశేషం. దీంతో గత రెండు నెలల్లోనే తమిళనాడు వ్యాప్తంగా వీరిపై 61 కేసులు నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రెండు రోజుల క్రితం తూత్తుకుడి శంకర రామేశ్వరాలయంలో జరిగిన కుంభాభిషేకంలో వీరు చేతివాటం చూపారు. భక్తుల వద్ద ఉన్న నగలను కొట్టేశారు. 67 సవర్ల బంగారంపై 16 కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసులు, సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. నిందితులు ముగ్గుర్నీ గుర్తించి వారిని అదుపులోకి తీసుకోగా, వారు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారని, వారిపై ఇప్పటికే బోలెడు కేసులున్నాయని గుర్తించారు. వారి నుంచి ఒక కారు, 52 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వారిపై మొత్తం 61 కేసులు ఉన్నాయని తెలిపారు. వారిని కోర్టు ఆదేశంపై, రిమాండ్ కు పంపారు.