bride: అత్తగారి కోరిక.. హెలికాప్టర్లో వచ్చిన కొత్త కోడలు!
- హర్యాణాలో బర్టా గ్రామానికి చెందిన రామ్ కాలీ
- చిన్న కోడలిని హెలికాప్టర్ లో కాపురానికి తేవాలని కోరిక
- నెరవేరిన వైనం.. అత్తగారి కళ్లల్లో ఆనందం
ఒక అత్తగారి చిత్రమైన కోరిక...కోడలికి ఆనందాన్ని కలిగించిన ఘటన హర్యాణాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే...హర్యాణాలోని బర్టా గ్రామానికి చెందిన మహిళ రామ్ కాలీకి నలుగురు కుమారులు. ముగ్గురికి వివాహం జరగడంతో తన చిన్నకుమారుడు సురేష్ వివాహం ఘనంగా నిర్వహించాలని తలంచింది. అంతేకాదు, కోడలిని పుట్టింటి నుంచి తన ఇంటికి హెలికాప్టర్ లో తీసుకురావాలన్నది ఆమె కోరిక. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. అందరూ సరేనన్నారు.
ఈ క్రమంలో సురేష్ కు తమ గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి చెందిన యువతితో వివాహం కుదిరింది. దీంతో రామ్ కాలీ కోరికను నెరవేర్చేందుకు కుటుంబ సభ్యులు నడుం బిగించారు. సురేష్ వివాహం వధువు ఇంట్లో ఘనంగా జరిగింది. అనంతరం వధువును బర్టా గ్రామానికి సురేష్ హెలికాప్టర్ లో తీసుకెళ్లాడు. ఈ హెలికాప్టర్ ను రామ్ కాలీ సోదరుడు బుక్ చేశాడు. హెలికాప్టర్ లో వచ్చిన కొత్త కొడలిని అత్తగారు దీవిస్తూ... ‘నిన్ను చూసినవారంతా.. కాపురానికి నిన్ను హెలికాప్టర్లో తీసుకువచ్చారా?’ అని ఆశ్చర్యంగా అడగాలని కోరుకున్నానని, తన కోరిక నెరవేరిందని చెప్పింది. ఆమె కోరుకున్నట్టుగానే ఈ అత్తగారి కొత్తకోడలు గురించి ఆ చుట్టుపక్కల ఊళ్లలో అప్పుడే ఘనంగా చెప్పేసుకుంటున్నారు లెండి!