prabhakar chowdary: హత్యలు, కబ్జాలు.. ఇదే గురునాథ్ రెడ్డి చరిత్ర!: ప్రభాకర్ చౌదరి

  • చంద్రబాబు పక్కన నిలబడే అర్హత కూడా గురునాథ్ కు లేదు
  • జేసీ మినహా ఆయనకు ఎవరి మద్దతు లేదు
  • ఆయన పక్కన నిలబడి ఫొటో కూడా దిగలేను

వైసీపీ మాజీ ఎమ్మెల్యే, అనంతపురం నేత గురునాథ్ రెడ్డి నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో, గురునాథ్ రెడ్డిపై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హత్యలు, కబ్జాలే గురునాథ్ రెడ్డి చరిత్ర అని ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన నిలబడే అర్హత కూడా ఆయనకు లేదని చెప్పారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీలో గురునాథ్ రెడ్డి చేరిక కార్యక్రమానికి తాను హాజరుకాబోనని ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు. ఆయన పక్కన నిలబడి ఫొటో దిగడానికి కూడా తాను ఇష్టపడనని చెప్పారు. జేసీ దివాకర్ రెడ్డి గ్రూపు కాబట్టే ఆయనను టీడీపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. జేసీ మినహా జిల్లాలో మరెవరూ ఆయనకు మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. పార్టీలో నిఖార్సుగా ఉంటే లాభం లేదనే విషయం తనకు అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురునాథ్ రెడ్డి టీడీపీలో చేరడాన్ని ముందునుంచి కూడా ప్రభాకర్ వ్యతిరేకిస్తున్నారు. వీరిద్దరికీ రాజకీయ వైరం ఉంది. ఈ నేపథ్యంలో, అనంతపురం టీడీపీలో చిచ్చు రాజుకుంది. 

prabhakar chowdary
anantapur Telugudesam
gurunath reddy
YSRCP
Chandrababu
  • Loading...

More Telugu News