faluknuma palace: విందు సమయంలో ఫలక్ నుమా ప్యాలెస్ కు బాంబు బెదిరింపు... సీక్రెట్ గా ఉంచిన పోలీసులు!
- 1500 మంది అతిథులకు ఫలక్ నుమా ప్యాలెస్ లో విందు
- అదే సమయంలో ఆగంతుకుడి ఫోన్ కాల్
- ప్యాలెస్ లో బాంబు పెట్టామని సమాచారం
ప్రఖ్యాత ఫలక్ నుమా ప్యాలెస్ దేశవిదేశీ ప్రముఖులకు ఆతిథ్యమిచ్చి పసందైన రుచులు పంచుతున్న సమయంలో వచ్చిన బాంబు బెదిరింపు ఫోన్ కాల్ పోలీసులను అప్రమత్తం చేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, టాటా, మిట్టల్ తో పాటు 150 దేశాలకు చెందిన సుమారు 1500 మంది ప్రముఖ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చారిత్రాత్మక ఫలక్ నుమా ప్యాలెస్ లో విందారగిస్తున్న సమయంలో గుర్తు తెలియని ఆగంతుకుడు పోలీసులకు ఫోన్ చేశాడు.
ఫలక్ నుమా ప్యాలెస్ లో బాంబు పెట్టినట్టు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది క్షుణ్ణంగా మరోసారి తనఖీలు చేశారు. అనంతరం అది ఉత్తుత్తి బెదిరింపు కాల్ గా నిర్ధారించుకున్నారు. దీంతో ఆగంతుకుడు ఫోన్ చేసిన నెంబర్ పై ఆరా తీస్తున్నారు. ఈ విషయాన్ని రాత్రి రహస్యంగా ఉంచిన పోలీసులు, ఈరోజు బయటపెట్టారు.